సీఎం పర్యటనకు ముమ్మర ఏర్పాట్లు..

హెలిప్యాడ్‌ను పరిశీలించిన కలెక్టర్ సిరి

మాధవరం సమీపంలో ఏర్పాట్లపై అధికారులకు కీలక ఆదేశాలు

మంత్రాలయం, ఆంధ్రప్రభ: ఈ నెల 25న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రాలయం మండలంలో పర్యటించనున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి ఏర్పాట్లను పరిశీలించారు. మండల పరిధిలోని మాధవరం గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్‌తో పాటు సభా వేదిక, పార్కింగ్, భద్రతా ఏర్పాట్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం కావడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు. హెలిప్యాడ్ నిర్మాణ పనులు నాణ్యతతో పాటు నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని ఆదేశించారు.

అలాగే ముఖ్యమంత్రి రాకపోకల మార్గాలు, ట్రాఫిక్ నియంత్రణ, తాగునీటి సదుపాయం, విద్యుత్ సరఫరా, పారిశుధ్య ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. పర్యటన సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

భద్రతా పరంగా చేపట్టాల్సిన చర్యలపై పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్, అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి జరుగుతున్న పనులను అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్లు తెలిపారు.

పర్యటన నేపథ్యంలో మాధవరం పరిసర ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్లు కొనసాగుతున్నాయి.