గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో సిట్ కీలక చర్య

ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కృష్ణలంక పోలీస్ స్టేషన్ సస్పెండెడ్ సీఐ నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సోమవారం అరెస్ట్ చేసినట్లు సమాచారం.

ఉదయం నాగరాజు నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు ఆయనను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసుల రాకను గమనించిన నాగరాజు కుటుంబ సభ్యులు, అనుచరులు అధికారులను అడ్డుకునేందుకు యత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొంతసేపు ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది.

పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన వారిని చెదరగొట్టిన అధికారులు అనంతరం ఇంట్లోకి ప్రవేశించారు. పరిస్థితి అదుపుతప్పే అవకాశం ఉండటంతో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. భద్రతా ఏర్పాట్ల మధ్య నాగరాజును అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

గాదె సాయికృష్ణ అదృశ్యం కేసు ఇప్పటికే రాష్ట్ర రాజకీయ, పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతం చేసిన నేపథ్యంలో నాగరాజు అరెస్ట్ కీలక మలుపుగా భావిస్తున్నారు. అయితే అరెస్టుకు సంబంధించిన పూర్తి వివరాలు, తదుపరి న్యాయ ప్రక్రియపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సాయికృష్ణ అదృశ్యం వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీసేందుకు దర్యాప్తు కొనసాగుతుండగా, నాగరాజు అరెస్టుతో కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.