గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు..
గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగంపై ఆరోపణలు..
- కార్యదర్శిపై విచారణకు డిమాండ్
నడికూడ, ఆంధ్రప్రభ : నడికూడ గ్రామ పంచాయతీ కార్యదర్శి సాయిని బిక్షపతిపై గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారంటూ వార్డు సభ్యులు, గ్రామస్తులు ఆరోపించారు. సర్పంచ్ ఎన్నికలు జరిగి ఆరు నెలలు గడిచినా ఇప్పటి వరకు సాధారణ గ్రామసభ నిర్వహించలేదని వారు పేర్కొన్నారు.
గ్రామసభ నిర్వహణతో పాటు గ్రామ పంచాయతీ నిధుల వినియోగంపై వివరాలు కోరినప్పుడల్లా కార్యదర్శి స్పష్టమైన సమాధానం ఇవ్వకుండా తప్పించుకుంటున్నారని ఆరోపించారు. నల్లా బిల్లులు, ఇంటి పన్నుల రూపంలో వసూలైన సుమారు రూ.4,65,218ను వ్యక్తిగత అవసరాలకు వినియోగించారని, అలాగే గ్రామానికి మంజూరైన పలు పనులు చేపట్టకుండానే నకిలీ బిల్లులు సమర్పించి నిధులు డ్రా చేశారని ఆరోపించారు.

వారి ఆరోపణల ప్రకారం, నర్సరీ విత్తనాలు, ఎల్ఈడీ లైట్లు, బతుకమ్మ ఉత్సవాలు, ఎన్నికల నిర్వహణ, డీజిల్, బ్లీచింగ్ పౌడర్, బ్లీచింగ్ బ్యాగులు, పైప్లైన్ లీకేజీల మరమ్మతులు, సిబ్బంది వేతనాలు, డోజర్ అద్దె, మోటార్ మరమ్మతుల పేర్లతో భారీ మొత్తాలను డ్రా చేసినట్లు తెలిపారు.
ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలికితీయాలని, అక్రమంగా వినియోగించిన నిధులను తిరిగి స్వాధీనం చేసుకుని గ్రామ అభివృద్ధికి కేటాయించాలని గ్రామస్తులు, వార్డు సభ్యులు డిమాండ్ చేశారు. అలాగే సంబంధిత కార్యదర్శిని వెంటనే బదిలీ చేసి కొత్త కార్యదర్శిని నియమించాలని కోరారు.
