Road Accident | ముగ్గురు మృతి.. 8 మందికి గాయాలు

Road Accident | ముగ్గురు మృతి.. 8 మందికి గాయాలు

Road Accident | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: తూర్పుగోదావరి జిల్లాలో సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వడిశలేరు-రంగంపేట మధ్య జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. పనులు ముగించుకుని స్వగ్రామాలకు తిరిగి వస్తున్న సమయంలో ఈ విషాదం చోటుచేసుకోవడం బాధిత కుటుంబాలను శోకసంద్రంలో ముంచింది.

పోలీసుల వివరాల ప్రకారం.. బాపట్ల జిల్లా కొల్లూరులో నిర్మాణ పనులు పూర్తి చేసుకుని కార్మికులు టాటా ఏస్ వాహనంలో తమ స్వగ్రామాలకు బయల్దేరారు. తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో వడిశలేరు-రంగంపేట మధ్యకు చేరుకోగానే వాహనం టైర్ పంక్చర్ అయింది. దీంతో డ్రైవర్ అదుపు కోల్పోవడంతో టాటా ఏస్ బోల్తా పడింది.

ప్రమాదం తీవ్రతకు సామర్లకోటకు చెందిన మసకపల్లి బాబు, మురమర్ల రాజు, కాకడ రాజు అక్కడికక్కడే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో ఎనిమిది మంది కార్మికులు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. స్థానికులు, పోలీసులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించారు.

ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకోగా, గాయపడిన వారి పరిస్థితిపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.