dto-venkanna-dies : విధి నిర్వహణలోనే .. Andhra Prabha Crime News
dto-venkanna-dies : విధి నిర్వహణలోనే .. Andhra Prabha Crime News
- ఆయన అమరుడు
- మింగేసిన బొగ్గులారీ
- డీటీవో వెంకన్నదుర్మరణం
- భూపాలపల్లిలో విషాదం..
- ఆర్టీఓ కార్యాలయం ఎదుట ఘోరం
- విధి పట్ల అంకితభావమే
- ఆయన చివరి శ్వాస
- భార్య, ముగ్గురు చిన్నారులకు భౌతికంగా దూరం
- ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ
- భూపాలపల్లి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
ఆంధ్రప్రభ ప్రతినిధి, భూపాలపల్లి
ప్రజల భద్రత కోసం రోడ్డుపై నిలబడి విధులు నిర్వహిస్తూ వాహనాలు తనిఖీ చేస్తున్న ఓ అధికారి.. తన విధి నిర్వహణలోనే మృత్యువు ఒడిలోకి జారిపోయాడు. క్షణాల వ్యవధిలో జరిగిన ఈ విషాద ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాను శోకసంద్రంలో ముంచెత్తింది. జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీవో) వెంకన్న సోమవారం ఉదయం జాతీయ రహదారి 353సి చెల్పూర్ ఆర్టీఓ కార్యాలయం ఎదుట జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. విధి నిర్వహణలో ఉండగానే ఆయన మృతి చెందడం అధికార వర్గాలు, సహచర ఉద్యోగులు, ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
dto-venkanna-dies : రోడ్డుపైనే కన్నుమూత
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సోమవారం ఉదయం సుమారు 9:30 గంటలకు ఆర్టీఓ కార్యాలయ ప్రాంగణంలోకి సీజ్ చేసిన హార్వెస్టర్ వాహనాన్ని ప్రవేశపెట్టేందుకు డీటీవో వెంకన్న స్వయంగా రోడ్డుపైకి వచ్చి వాహనాల రాకపోకలను నియంత్రిస్తున్నారు. అదే సమయంలో మార్ల్ ట్రాన్స్పోర్ట్కు చెందిన బొగ్గు లోడ్ లారీ (టీఎస్22టీ2687) జెన్కో వైపు వెళ్తుండగా వేగంగా వచ్చి అదుపు తప్పి వెంకన్నను బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలపాలైన ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. ప్రజల ప్రాణాలను కాపాడేందుకు, రహదారి భద్రతను మెరుగుపరచేందుకు విధులు నిర్వహిస్తున్న సమయంలోనే ఆయన ప్రాణాలు కోల్పోవడం ఈ ఘటనలోని అత్యంత విషాదకర అంశంగా నిలిచింది.
dto-venkanna-dies : జగిత్యాల నుంచి వచ్చి 17 రోజులకే విషాదం
సాధారణ బదిలీల్లో భాగంగా ఈ నెల 5న జగిత్యాల జిల్లా నుంచి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వచ్చిన వెంకన్న ఇటీవలే బాధ్యతలు చేపట్టారు. కొత్త జిల్లాలో రవాణా వ్యవస్థను మరింత క్రమబద్ధీకరించేందుకు చర్యలు ప్రారంభించిన ఆయన, తన విధుల పట్ల అంకితభావంతో పనిచేస్తున్నారని సహచరులు గుర్తు చేసుకుంటున్నారు. సార్ ఎప్పుడూ ఫీల్డ్‌లోనే ఉండేవారు.. ఏ పని అయినా స్వయంగా పర్యవేక్షించేవారు అని పలువురు సిబ్బంది కన్నీటి కళ్లతో చెప్పడం అక్కడి వాతావరణాన్ని మరింత విషాదభరితంగా మార్చింది.
dto-venkanna-dies : కుటుంబానికి తీరని లోటు..
మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా గ్రామానికి చెందిన వెంకన్న సాధారణ కుటుంబం నుంచి ఎదిగిన అధికారి. 2012లో ఏఎంవీఐగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి క్రమంగా ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఆయన తండ్రి బ్రహ్మయ్య మండల పరిషత్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ పొందారు. వెంకన్నకు భార్య స్వప్న, ఇద్దరు కుమార్తెలు సాయి శరణ్య (20), శ్రీనిత (11), కుమారుడు శృతిక్ (8) ఉన్నారు. కుటుంబానికి అండగా నిలిచిన పెద్దదిక్కు ఒక్కసారిగా దూరం కావడంతో కుటుంబ సభ్యుల రోదనలు ప్రతి ఒక్కరినీ కలచివేశాయి. తండ్రి కోసం చిన్నారులు విలపించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.
dto-venkanna-dies : బంగ్లా గ్రామం కన్నీరు మున్నీరు
వెంకన్న మృతి వార్త తెలియగానే మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా గ్రామంలో విషాదం అలుముకుంది. గ్రామస్తులు, బంధువులు, స్నేహితులు ఆయన ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. చిన్న వయసులోనే ఉన్నత స్థాయికి చేరుకుని కుటుంబానికి, గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చిన వెంకన్న అకాల మరణం పట్ల గ్రామ ప్రజలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
dto-venkanna-dies : సహచరుల కళ్లలో జలపాతం
ప్రమాద వార్త తెలిసిన వెంటనే రవాణా శాఖ అధికారులు, ఉద్యోగులు, స్థానిక ప్రజలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కొద్దిసేపటి క్రితం వరకు తమతో కలిసి విధులు నిర్వహించిన అధికారి ఇక లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేక పలువురు సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు. ఆర్టీఓ కార్యాలయం పరిసరాలు శోకసంద్రంగా మారాయి.
dto-venkanna-dies : ఘటన స్థలిలో.. ఉన్నతాధికారులు
ప్రమాద సమాచారం అందుకున్న జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (విజిలెన్స్) ఎం. చంద్రశేఖర్ గౌడ్, డీటీసీలు రవీందర్ కుమార్, సురేష్ రెడ్డి, ఎంవీఐ చంద్రశేఖర్, స్టేట్ ఎన్ఫోర్స్మెంట్ టీమ్ అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం వెంకన్న మృతదేహానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
dto-venkanna-dies : ప్రజా సేవలోనే ముగిసిన జీవితం
ప్రజల కోసం, రహదారి భద్రత కోసం, విధి నిర్వహణ కోసం చివరి క్షణం వరకు కృషి చేసిన ఓ అధికారి జీవితం రోడ్డుపైనే ముగియడం అందరినీ కలచివేసింది. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన డీటీవో వెంకన్నను భూపాలపల్లి జిల్లా చాలా కాలం గుర్తుంచుకుంటుందనడంలో సందేహం లేదు. ఆయన సేవలు, అంకితభావం సహచరులకు స్ఫూర్తిగా నిలుస్తాయని పలువురు పేర్కొన్నారు.
- dto-venkanna-dies : పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాం
- ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్
ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. లారీ డ్రైవర్ మహ్మద్ తస్లీమ్ మద్యం సేవించి వాహనం నడిపాడా లేదా అనే అంశంతో పాటు ప్రమాదానికి దారితీసిన అన్ని కారణాలపై సమగ్ర విచారణ కొనసాగుతోందన్నారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు.
