TG | ఇందిర‌మ్మ రాజ్యంలో రైతన్న గుండెల్లో గునపం పోటు – కేటీఆర్

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : ఒక‌టా రెండా… అన్నీ అబ‌ద్ధాలే!… అక్షరాల 420 అబద్దపు హామీలు ఇచ్చార‌ని సీఎం రేవంత్ రెడ్డి పై బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వ‌జమెత్తారు. అర్హులంద‌రికీ రుణ‌మాఫీ చేశామ‌ని, ఇగ ఇచ్చేది లేద‌ని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు అసెంబ్లీలో చేసిన ప్ర‌క‌ట‌న‌పై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.

రైతుల‌కు రుణ‌మాఫీ విష‌యంలో సీఎం రేవంత్ స‌ర్కార్.. ఎక్కని గుడి లేదు.. మొక్కని దేవుడు లేడు. చేయని శపథం లేదు.. ఆడని అబద్దం లేదు. ఒకటా రెండా.. అక్షరాల 420 అబద్దపు హామీలు ఇచ్చార‌ని కేటీఆర్ మండిప‌డ్డారు.

ఎక్స్ వేదిక‌గా ఆయ‌న పోస్టు పెట్టారు. వ‌రంగ‌ల్ డిక్ల‌రేష‌న్ కు తూట్లు పొడిచిన కాంగ్రెస్‌శాసన సభ సాక్షిగా తెలంగాణ రైతన్న గుండెలపై ఇందిర‌మ్మ రాజ్యం గునపం దింపింద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. చట్టసభల సాక్షిగా వరంగల్ డిక్లరేషన్‌కు క‌ప‌ట కాంగ్రెస్ తూట్లు పొడిచింద‌ని నిప్పులు చెరిగారు.

అధికారం కోసం అందరికీ రుణమాఫీ, అధికారం దక్కాక కొందరికే రుణమాఫీ అన్న‌ట్టు ఉంద‌ని పేర్కొన్నారు. పెట్టెలో ఓట్లు పడ్డాయ్.. జేబులో నోట్లు పడ్డాయ్.. ఢిల్లీకి మూటలు ముట్టాయ్ ఇక ఇచ్చిన వాగ్దానాలు ఉంటే ఎంత గంగలో కలిస్తే ఎంత అన్నట్లుంది కాంగ్రెస్ యవ్వారం అని కేటీఆర్ విమ‌ర్శించారు.

ఒక కుటుంబంలో ఒక్క‌రికే రుణ‌మాఫీరూ.2 లక్షల వరకు కుటుంబంతో సంబంధం లేకుండా రుణమాఫీ అని ప్రకటించార‌ని కేటీఆర్ అన్నారు. ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక్కరికే రుణమాఫీ అని చెబుతున్నార‌న్నారు. నాడు రూ. రెండు లక్షలు దాటినా రుణమాఫీ అన్నార‌ని,

ఇప్పుడేమో రూ. 2 లక్షల పైబడితే మాఫీ లేదంటున్నార‌ని మండిప‌డ్డారు. నాడు ఓట్ల కోసం హామీలు .. నేడు ఎగవేత కోసం కొర్రీలు. మిస్టర్ రాహుల్, మాఫీమాంగో తెలంగాణసే అని కేటీఆర్ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *