25న వెంకటగిరిలో జాబ్ మేళా
తిరుపతి కలెక్టరేట్, ఆంధ్రప్రభ : వెంకటగిరిలోని ప్రభుత్వ ఐటీఐలో జూన్ 25న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్, సీడాప్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించే ఈ జాబ్ మేళా పోస్టర్లను సోమవారం కలెక్టరేట్‌లో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ గోవిందరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీ సిటీ, మేనకూరు సెజ్, ఈఎంసీ క్లస్టర్ తిరుపతి, చెన్నైలోని 10 బహుళజాతి సంస్థల్లో 520కిపైగా ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
పదో తరగతి, ఇంటర్మీడియట్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అభ్యర్థులు తప్పనిసరిగా https://naipunyam.ap.gov.in/లో నమోదు చేసుకోవాలని తెలిపారు. రిజిస్ట్రేషన్‌కు జూన్ 24 చివరి తేదీ కాగా, స్పాట్ రిజిస్ట్రేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పీడీ డీఆర్‌డీఏ టీఎన్ శోభన్ బాబు, జీఎం డీఐసీ చంద్రశేఖరరావు, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్. లోకనాథం, ప్లేస్‌మెంట్ ఆఫీసర్ ఎ. గణేష్ తదితరులు పాల్గొన్నారు.
