Badminton Association of India | భారత్‌లో ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ లీగ్‌కు బాటలు..
- బ్యాడ్మింటన్‌కు కొత్త ఊపు..
- లీగ్ నిర్వహణకు సంస్థల ఎంపిక ప్రారంభం
- ఫ్రాంచైజీ తరహా బ్యాడ్మింటన్ లీగ్
- జూన్ 30 వరకు దరఖాస్తుల స్వీకరణ
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: దేశంలో ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ లీగ్‌ను ప్రారంభం కానుంది. ఈ మేరకు భారత బ్యాడ్మింటన్ సంఘం (బీఏఐ) కీలక ముందడుగు వేసింది. ఈ మేరకు క్రీడల నిర్వహణ సంస్థలు, ఈవెంట్ ప్రమోటర్లు, వాణిజ్య హక్కుల నిర్వాహకులు తదితర సంస్థల నుంచి ‘ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్’ (ఈఓఐ)లను ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ లీగ్‌ను అభివృద్ధి చేసి నిర్వహించేందుకు ఆహ్వానించింది.
భారత్‌లో బ్యాడ్మింటన్‌కు మరింత వాణిజ్యపరమైన గుర్తింపు తీసుకురావడం, అభిమానుల భాగస్వామ్యాన్ని పెంచడం, దీర్ఘకాలికంగా క్రీడాభివృద్ధికి స్థిరమైన లీగ్ వ్యవస్థను రూపొందించడం ఈ చర్య వెనుక ప్రధాన లక్ష్యమని బీఏఐ వెల్లడించింది. ఆసక్తి చూపే సంస్థలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రీడా లీగ్‌ల నిర్వహణ అనుభవం ఉండాలని పేర్కొంది. ఈవెంట్ మేనేజ్మెంట్, స్పాన్సర్షిప్ సమీకరణ, మీడియా హక్కులు, ప్రసార వ్యవహారాలు, మార్కెటింగ్, వాణిజ్య కార్యకలాపాల్లో నైపుణ్యం తప్పనిసరిగా ఉండాలని స్పష్టం చేసింది.
అంతేకాకుండా ప్రతిపాదిత లీగ్‌ను అభివృద్ధి చేసి నిర్వహించే ఆర్థిక సామర్థ్యాన్ని కూడా సంస్థలు నిరూపించాల్సి ఉంటుంది. ఇందుకోసం కనీసం రూ.30 కోట్ల విలువైన బ్యాంక్ గ్యారంటీ లేదా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ నుంచి బ్యాంక్ కంఫర్ట్ లెటర్ సమర్పించాలని బీఏఐ సూచించింది. సమర్పించే ప్రతిపాదనల్లో లీగ్ నిర్వహణ విధానం, పోటీ నిర్మాణం, ఫ్రాంచైజీ యాజమాన్య నమూనా, ఆదాయ వనరుల వ్యూహం, స్పాన్సర్షిప్, ప్రసార హక్కుల ప్రణాళిక, మార్కెటింగ్ విధానం, పాలనా వ్యవస్థ, ఆర్థిక అంచనాలు వంటి అంశాలను వివరించాలని కోరింది. అన్ని పత్రాలతో కూడిన పూర్తి ప్రతిపాదనలను సమర్పించేందుకు జూన్ 30ను చివరి తేదీగా నిర్ణయించింది. ఈ లీగ్ అమలులోకి వస్తే భారత బ్యాడ్మింటన్‌కు కొత్త ఊపు లభించడంతో పాటు యువ క్రీడాకారులకు మరిన్ని అవకాశాలు దక్కనున్నాయని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.
