ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత.
ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత.
ఎమ్మెల్యే కొలకపూడి శ్రీనివాసరావు..
తిరువూరులో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం పరిశీలించిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు
ప్రజా సమస్యలపై వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాలు
తిరువూరు, ఆంధ్రప్రభ : ఓటు హక్కు ప్రతి ఒక్కరి బాధ్యత అని తిరువూరు శాసనసభ్యుడు కొలికపూడి శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. పట్టణంలోని 17, 18, 19, 20 వార్డుల్లో కొనసాగుతున్న ప్రత్యేక ఓటరు జాబితా సవరణ కార్యక్రమాన్ని కొలికపూడి శ్రీనివాసరావు ప్రత్యక్షంగా పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించిన ఆయన, అర్హులైన ప్రతి ఓటరు వివరాలు జాబితాలో సక్రమంగా నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా ప్రజలకు ఓటరు జాబితా సవరణ కార్యక్రమం ప్రాముఖ్యతను వివరించిన ఎమ్మెల్యే, ఎవరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా అవసరమైన పత్రాలు సమర్పించి పూర్తి సహకారం అందించాలని కోరారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ఓటరు జాబితా సవరణ కార్యక్రమం కీలకమని పేర్కొన్నారు.
బాధ్యతాయుతంగా పనిచేయాలి..
బీఎల్వోలు, బీఎల్ఏలు , వార్డు నాయకులు సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. ముఖ్యంగా బీఎల్ఏలు ఎలాంటి నిర్లక్ష్యానికి తావు ఇవ్వకుండా ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన ఓటర్ల వివరాలను పరిశీలించాలని ఆదేశించారు. పర్యటనలో భాగంగా 17వ వార్డులోని తోళ్ల బజార్ ప్రాంత ప్రజలు తాగునీటి సమస్య, డ్రైనేజీ సౌకర్యాల లేమి, స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు అవసరాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన కొలికపూడి శ్రీనివాసరావు సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి, మరుసటి రోజే ఆ ప్రాంతాన్ని సందర్శించి సమస్యలను పరిశీలించాలని ఆదేశించారు.
అలాగే ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించే చర్యలు చేపట్టాలని అధికారులను నిర్దేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీఎల్వోలు, బీఎల్ఏలు, సంబంధిత శాఖల అధికారులు, కూటమి పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. ప్రజాసమస్యల పరిష్కారంతో పాటు ఓటరు జాబితా సవరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.
