DeputyCM | హరితాభివృద్ధిపై పవన్ ఫోకస్..

DeputyCM | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: కోస్తా ప్రాంతాల్లో హరితాభివృద్ధి, పర్యావరణ సమతుల్యత సాధన లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది. ఇందులో భాగంగా ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గురువారం ఏపీ సచివాలయంలో అటవీ శాఖ అధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు.

తీర ప్రాంతాల్లో గ్రీన్ బెల్ట్ అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, హరిత వలయాల విస్తరణ అంశాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. గ్రీన్ బెల్ట్ అభివృద్ధికి సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

గ్రామీణ ప్రాంతాల్లో సోషల్ ఫారెస్ట్రీ కార్యక్రమాలను మరింత విస్తరించే అవకాశాలపై కూడా సమావేశంలో చర్చించారు. అటవీ సంపద పెంపు, తీర ప్రాంతాల్లో వృక్ష సంపద అభివృద్ధి, పర్యావరణ సమతుల్యత పరిరక్షణకు అవసరమైన చర్యలను సమీక్షించారు.

పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. హరితహారం, సామాజిక అడవుల పెంపకం వంటి కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు.

ఈ సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి వి. వినయ్ చంద్, పీసీసీఎఫ్ పి.వి. చలపతిరావు, సీసీఎఫ్ బీఎన్నెం మూర్తి, సీసీఎఫ్ ఎన్. నాగేశ్వరరావు, అటవీ శాఖ సలహాదారు పి. మల్లికార్జునరావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.