Telegram | ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన టెలిగ్రామ్..
Telegram | ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన టెలిగ్రామ్..
కేంద్ర నిషేధాన్ని సవాల్ చేసిన మెసేజింగ్ దిగ్గజం
Telegram | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్: ప్రముఖ మెసేజింగ్ వేదిక టెలిగ్రామ్ భారత ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. నీట్ పరీక్షల లీకేజీ, అక్రమ కార్యకలాపాల ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది.
తమపై విధించిన ఆంక్షల వల్ల భారతదేశంలోని కోట్లాది మంది వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వ్యాపార కార్యకలాపాలపై కూడా తీవ్ర ప్రభావం పడుతోందని టెలిగ్రామ్ తన పిటిషన్‌లో పేర్కొంది. నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని కోరుతూ అత్యవసర విచారణ జరపాలని కోర్టును అభ్యర్థించింది. టెలిగ్రామ్ అభ్యర్థనను పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు, పిటిషన్‌ను అత్యవసర విచారణకు స్వీకరించినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఇక నీట్ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాల లీకేజీ, సమాధానాల పంపిణీ వంటి అక్రమ కార్యకలాపాలు టెలిగ్రామ్ గ్రూపులు, ఛానెళ్ల ద్వారా జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. పరీక్షల పారదర్శకతను కాపాడేందుకు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడడానికే తాత్కాలిక ఆంక్షలు విధించినట్లు అధికారులు పేర్కొన్నారు.
