Dementia risk Telangana | డిమెన్షియా ప్రమాదంపై తాజా పరిశోధన

Dementia risk Telangana | డిమెన్షియా ప్రమాదంపై తాజా పరిశోధన

Dementia risk Telangana | గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ప్రమాదం
మహిళల్లో అధిక ముప్పు సూచనలు
విటమిన్ లోపాలే ప్రధాన కారణం
మెదడు ఆరోగ్యంలో పోషకాహార పాత్ర
నివారణకు ఆరోగ్యకర జీవనశైలి సూచనలు

Dementia risk Telangana | హైదరాబాద్, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: ‘మతిమరుపు’ ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న సమస్య. చెప్పిన విషయాలు మరచిపోవడం… గంట క్రితం పెట్టిన వస్తువు ఎక్కడుందో గుర్తులేకపోవడం వంటివి ఎక్కువమందిలో కనిపిస్తున్నాయి. ప్రధానంగా తెలంగాణలోని మధ్యవయస్కులు, వృద్ధుల్లో ఈ మతిమరుపు వ్యాధి (డిమెన్షియా) ముప్పు ఊహించిన దానికంటే ఎక్కువగా ఉన్నట్టు తాజా పరిశోధన స్పష్టం చేస్తోంది.

రాష్ట్రంలో ప్రతి పది మందిలో నలుగురు డిమెన్షియా బారినపడుతున్నారని ఐసీఎంఆర్, జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) నిర్వహించిన తాజా అధ్యయనంలో బయటపడింది. ముఖ్యంగా విటమిన్ లోపాలు, పోషకాహార అసమతుల్యత, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య పరిస్థితులు ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్రఖ్యాత వైద్య పత్రిక ‘ది లాన్సెట్ రీజినల్ హెల్త్ – సౌత్ ఈస్ట్ ఏషియా’లో ప్రచురితమైన ఈ అధ్యయనం తెలంగాణ ఆరోగ్య రంగానికి ఒక హెచ్చరికగా మారింది.

ప్రస్తుతం గుండెజబ్బులు, మధుమేహం, రక్తపోటు వంటి వ్యాధులపై ఎక్కువగా చర్చ జరుగుతున్నప్పటికీ, రాబోయే దశాబ్దాల్లో మతిమరుపు సమస్య కూడా పెద్ద ప్రజారోగ్య సవాలుగా మారే ప్రమాదాన్ని ఈ నివేదిక సూచిస్తోంది.


ప్రమాదం అంచున వృద్ధులు

రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు చెందిన 40 నుంచి 80 సంవత్సరాల మధ్య వయస్సు గల 556 మందిపై పరిశోధకులు అధ్యయనం చేయగా సగటు వయస్సు 63 సంవత్సరాలు. భారతీయ పరిస్థితులకు అనుగుణంగా రూపొందించిన పరిశోధనలో ఆందోళనకర అంశాలు వెలుగులోకి వచ్చాయి.

అధ్యయనంలో పాల్గొన్న వారిలో 39 శాతం మంది భవిష్యత్తులో డిమెన్షియా బారినపడే ప్రమాదంలో ఉన్నట్లు తేలింది. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న వారిలో 60 శాతం మంది అధిక ప్రమాదంలో ఉండగా, పట్టణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 27 శాతానికి పరిమితమైంది.

ఈ భారీ అంతరానికి ప్రధాన కారణాలు పోషకాహార లోపం, ఆరోగ్య సేవలు అందుబాటు కొరత, వృద్ధుల ఆరోగ్య పరీక్షల లోపం, ఆహారంలో వైవిధ్యం తగ్గడం వంటి అంశాలని పరిశోధకులు చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యమైన సూక్ష్మపోషకాల లోపం ఎక్కువగా ఉండటం కూడా డిమెన్షియా ప్రమాదాన్ని పెంచుతున్నట్లు అధ్యయనం సూచించింది.

మహిళల్లో ప్రమాద స్థాయి అధికంగా ఉండటం కూడా ఆందోళన కలిగిస్తోంది. పోషకాహార లోపం, రక్తహీనత, హార్మోన్ల మార్పులు, ఆరోగ్యంపై తక్కువ శ్రద్ధ వంటి అంశాలు మహిళలను మరింత ప్రమాదంలోకి నెట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తెలంగాణలో వృద్ధుల జనాభా క్రమంగా పెరుగుతోంది. వైద్య సదుపాయాలు మెరుగుపడటంతో జీవితకాలం పెరుగుతున్నప్పటికీ, వృద్ధాప్య సంబంధిత వ్యాధులు కూడా పెరుగుతున్నాయి. డిమెన్షియా కేసులు పెరిగితే కుటుంబాలపై, ఆరోగ్య వ్యవస్థపై, సామాజిక భద్రతా వ్యవస్థపై భారీ భారం పడే అవకాశం ఉంది.

ఈ గణాంకాలు తెలంగాణలో పోషకాహార సమస్య ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా విటమిన్ డీ, బీ-2, బీ-6, బీ-12 స్థాయిలు తక్కువగా ఉన్నవారిలో డిమెన్షియా ప్రమాద సూచికలు గణనీయంగా ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు గుర్తించారు.

మెదడు ఆరోగ్యానికి విటమిన్లే పునాది అని, మెదడు కణాల పనితీరు, నాడీ వ్యవస్థ ఆరోగ్యం, జ్ఞాపకశక్తి నిర్వహణలో కొన్ని విటమిన్లు కీలక పాత్ర పోషిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. బీ సమూహానికి చెందిన విటమిన్లు నాడీ కణాల రక్షణకు అవసరం. విటమిన్ డీ మెదడు కణాల మధ్య సమాచార మార్పిడిని ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. ఈ పోషకాల కొరత దీర్ఘకాలంలో జ్ఞాపకశక్తి క్షీణతకు దారితీసే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.


మంచి ఆహారంతో ఆరోగ్య పరిరక్షణ

ఇప్పటి వరకు పోషకాహార కార్యక్రమాలు ప్రధానంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారులకే పరిమితమయ్యాయి. కానీ తాజా అధ్యయనం వృద్ధులు, మధ్యవయస్కుల్లో కూడా పోషకాహార లోపాలు తీవ్రంగా ఉన్నాయని చూపించింది. దీంతో వృద్ధుల ఆరోగ్య పరీక్షలు, విటమిన్ స్క్రీనింగ్, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక పోషకాహార కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఏర్పడింది.


విటమిన్ లోపాలే అసలు సమస్య

విటమిన్లోపం ఉన్నవారి శాతం
బీ-2 లోపం64 శాతం
డీ34 శాతం
ఫోలేట్ (బీ-9)8 శాతం
బీ-13 శాతం

నిపుణుల అభిప్రాయం ప్రకారం సమతుల ఆహారం, పాలు, గుడ్లు, ఆకుకూరలు, పప్పు ధాన్యాలు, పండ్లు, చేపలు వంటి పోషకాహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం, రక్తపోటు–మధుమేహాన్ని నియంత్రణలో ఉంచడం, శారీరక వ్యాయామం, మానసిక చురుకుదనం పెంచే అలవాట్లు డిమెన్షియా ప్రమాదాన్ని తగ్గించగలవని చెబుతున్నారు.

Leave a Reply