టెక్నాలజీతో క్రీడల్లో విప్లవాత్మక మార్పులు

టెక్నాలజీతో క్రీడల్లో విప్లవాత్మక మార్పులు

స్పోర్ట్స్ స్టార్టప్స్‌కు ‘స్ప్రింట్‌ఎక్స్’ వేదిక : యుజ్వేంద్ర చాహల్

హైదరాబాద్, ఆంధ్రప్రభ : టెక్నాలజీ అభివృద్ధితో క్రీడల స్వరూపమే మారిపోయిందని భారత క్రికెట్ జట్టు ఆటగాడు Yuzvendra Chahal యుజ్వేంద్ర చాహల్ అన్నారు. స్పోర్ట్స్, ఫిట్‌నెస్, వెల్‌నెస్, గేమింగ్ రంగాల్లో వినూత్న ఆలోచనలతో ముందుకొచ్చే స్టార్టప్స్‌కు ‘స్ప్రింట్‌ఎక్స్’ సంస్థ మార్గదర్శక వేదికగా నిలవనుందని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లోని SAS i Towers ఎస్ఏఎస్ ఐ టవర్స్‌లో సోమవారం నిర్వహించిన ‘స్ప్రింట్‌ఎక్స్ ప్లేమేకర్స్’ యాక్సిలరేటర్ కార్యక్రమాన్ని చాహల్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత కొన్నేళ్లుగా క్రీడలు, సాంకేతిక పరిజ్ఞానం మధ్య అనుబంధం మరింత బలపడిందన్నారు. ఆటగాళ్ల ప్రదర్శన విశ్లేషణ, వ్యూహాల రూపకల్పన, ప్రత్యర్థుల బలాబలాల అంచనా, ఫిట్‌నెస్ నిర్వహణ, గాయాల నుంచి కోలుకునే ప్రక్రియల్లో టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తోందని వివరించారు.

క్రికెట్‌లో బౌలింగ్ లెంగ్త్ ఎంపిక నుంచి బ్యాటర్ల బలహీనతల విశ్లేషణ వరకు ఆధునిక సాంకేతికత ఉపయోగపడుతోందని చెప్పారు. మ్యాచ్‌లు, సాధన అనంతరం శరీర పునరుద్ధరణకు కూడా టెక్నాలజీ సహకరిస్తోందన్నారు.

ఈ సందర్భంగా 360డీ స్పోర్ట్స్ వ్యవస్థాపక భాగస్వామి కార్తిక్ యనమండ్ర మాట్లాడుతూ… స్పోర్ట్స్ టెక్, గేమింగ్, ఈ-స్పోర్ట్స్ రంగాల్లో పనిచేసే స్టార్టప్స్‌కు అన్ని విధాలా మద్దతు అందించేందుకు స్ప్రింట్‌ఎక్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశంలోనే తొలిసారిగా ఈ రంగాలకు ప్రత్యేకంగా ఫుల్-స్టాక్ యాక్సిలరేటర్ కార్యక్రమాన్ని 360డీ స్పోర్ట్స్, లెగసీ సంస్థలు సంయుక్తంగా ప్రారంభించాయని చెప్పారు.

అథ్లెట్ ట్రైనింగ్, పనితీరు విశ్లేషణ, ఏఐ కోచింగ్, రియల్‌టైమ్ ఫీడ్‌బ్యాక్, క్రీడాకారుల అంచనా వ్యవస్థలు, స్మార్ట్ స్టేడియాల అభివృద్ధి వంటి అంశాలపై ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. స్టార్టప్స్‌ను బహుళజాతి సంస్థలు, ప్రభుత్వ వ్యవస్థలతో అనుసంధానం చేయడంతో పాటు రూ.25 లక్షల వరకు పెట్టుబడి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.

స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ టెక్నాలజీలు, డేటా అనలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గేమింగ్, ఫ్యాన్ ఎంగేజ్‌మెంట్, డిజిటల్ కమ్యూనిటీ ప్లాట్‌ఫార్ములు, మీడియా టెక్నాలజీలు తదితర రంగాల్లో పని చేస్తున్న స్టార్టప్స్ ఈ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. 24 వారాల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో 12 వారాల యాక్సిలరేషన్, 12 వారాల మెంటర్‌షిప్ అందించనున్నారు. ప్రతి కోహార్ట్‌లో 10 స్టార్టప్స్‌ను ఎంపిక చేసి మార్కెట్ యాక్సెస్, పరిశ్రమ నిపుణుల మార్గదర్శకత్వం, పెట్టుబడి అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో క్రికెటర్ Jayant Yadav జయంత్ యాదవ్, స్ప్రింట్‌ఎక్స్ మెంటర్ జీఆర్ రెడ్డి, హైదరాబాద్ ఏంజెల్స్ సీఈఓ రత్నాకర్, లెగసీ సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply