Indian IT job market | గ్లోబల్ లేఆఫ్లతో పెరిగిన ఉద్యోగ అన్వేషణ

Indian IT job market | గ్లోబల్ లేఆఫ్లతో పెరిగిన ఉద్యోగ అన్వేషణ

Indian IT job market | రిక్రూట్‌మెంట్ తగ్గుదలతో కఠినమైన మార్కెట్ పరిస్థితి
బెంగళూరు, హైదరాబాద్‌లో ఎక్కువ టెకీలు ప్రభావితం
ఏఐ బూమ్‌ మరియు కంపెనీల పెట్టుబడులు
విదేశాల నుంచి తిరిగివచ్చిన వారికి సవాళ్లు

Indian IT job market | న్యూఢిల్లీ: టెక్ కంపెనీల్లో ప్రపంచవ్యాప్తంగా భారీగా లేఆఫ్లు పెరిగాయి. మే నెలలో ఉద్యోగాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న భారతీయ నిపుణుల సంఖ్య నాలుగు రెట్లకు పైగా పెరిగింది. దీని వల్ల ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న దేశీయ ఉద్యోగ మార్కెట్లోకి భారీ సంఖ్యలో నైపుణ్యం కలిగిన ఉద్యోగులు వచ్చి చేరారు.

ఉద్యోగ నియామక సంస్థ ఎక్స్ఫెనో నిర్వహించిన అధ్యయనం ప్రకారం జనవరి నుంచి 1000 మందికి పైగా ఉద్యోగులను తొలగించిన 20కి పైగా ప్రధాన కంపెనీలకు చెందిన 56,000 మందికి పైగా భారతీయ నిపుణులు కొత్త అవకాశాల కోసం చురుగ్గా వెతుకుతున్నారు. ఏప్రిల్ నెలలో ఇలాంటి వారి సంఖ్య 12 వేల వరకు ఉంది.

ఉద్యోగాల కోత కారణంగా కొందరు మార్కెట్లోకి రాగా, మరికొందరు స్వచ్ఛందంగానే కొత్త అవకాశాలను అన్వేషిస్తున్నారు. లేఆఫ్ తర్వాత ఉద్యోగాలు కోల్పోయిన వారు కొందరు ఉంటే, ఉద్యోగ భద్రతపై పెరుగుతున్న ఆందోళనలతో చాలా మంది ఇతర అవకాశాల కోసం చురుగ్గా అన్వేషిస్తున్నారని ఎక్స్ఫెనో తెలిపింది.

గత వారంలోనే దాదాపు మూడింట రెండు వంతుల మంది రిక్రూటర్లు యజమానులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని ఈ అధ్యయనంలో తేలింది. ఆరు నెలల క్రితం చురుగ్గా ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్న వారు సుమారు 5 వేలుగా ఉండగా, అంతకు ముందు సంవత్సరం ఈ సంఖ్య 4 వేల వరకు ఉంది.

ఒరాకిల్, మెటా, డెల్, సిస్కో, అమెజాన్ వంటి అనేక కీలక సంస్థల్లో మూడింట రెండు వంతుల కంటే ఎక్కువ సంస్థల ప్రధాన కార్యాలయాలు అమెరికాలోనే ఉండటం కూడా ఈ పెరుగుదలకు కారణంగా ఉందని పేర్కొంది. ఏఐ బూమ్‌తో దీనిపై కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి.

మరోవైపు భౌగోళిక అనిశ్చితి పరిస్థితులు, ఖర్చుల విషయంలో కంపెనీల అప్రమత్తత వంటి కారణాలతో టెక్ కంపెనీల రిక్రూట్మెంట్ 28 నెలల కనిష్టానికి నమోదైంది.


ఉద్యోగాల కోతల మూలంగా మొత్తం ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్న వారిలో లేఆఫ్లతో ఉద్యోగాలు కోల్పోయిన టెక్ నిపుణులు అత్యంత ఎక్కువగా ఉన్నారు. బెంగళూరు 36 శాతం, హైదరాబాద్ 19 శాతంగా ఉంది.

అమెరికా సంస్థల్లో పని చేస్తున్న విదేశీ ఉద్యోగుల విషయంలో పెరుగుతున్న అనిశ్చితి, సవాళ్లు భారతీయ ఉద్యోగుల్లో కొత్త ఉద్యోగాల అన్వేషణ పెరగడానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి.

పరిమితంగా ఉన్న సాంకేతిక ఉద్యోగ అవకాశాల కోసం పోటీ తీవ్రమవుతున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. టెక్నాలజీ రంగంలో నియామకాల సంఖ్య, వేగం తగ్గడం ఉద్యోగార్థులు మార్కెట్లోకి అడుగుపెట్టడానికి అనుకూలమైన పరిస్థితి కాదని ఎక్స్ఫెనో సీఈఓ ఫ్రాన్సిస్ పడమడన్ చెప్పారు.

మార్కెట్ పరిస్థితులు, ప్రపంచ పరిణామాలు, భౌగోళిక రాజకీయ సవాళ్లు భారతీయ టెక్ రంగంలోని అన్ని విభాగాల్లో, వివిధ ఎక్స్‌పీరియన్స్ స్థాయిల్లోనూ నియామక ప్రక్రియ నెమ్మదించాయని చెప్పారు. ఎంట్రీ లెవల్, హయ్యర్ లెవల్‌లోనూ ఉద్యోగ డిమాండ్ తక్కువగా ఉందని, ఈ స్థాయిలో ప్రతిభావంతులకు పరిస్థితులు కఠినంగా ఉన్నాయని తెలిపారు.

ఖాళీలను భర్తీ చేయడానికి భారీ నియామకాలు పరిమితం అవుతున్నాయని, దీని వల్ల ఉద్యోగం కోసం చూస్తున్న నిపుణులకు అవకాశాలు తక్కువగా లభిస్తున్నాయని చెప్పారు. విదేశాల్లో అధిక ప్యాకేజీతో లేఆఫ్ తర్వాత స్వదేశానికి వచ్చిన వారికి ఈ స్థాయి ఉద్యోగాలు లభించడం అతిపెద్ద సవాలుగా మారిందని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply