Drone manufacturing India | డ్రోగో ఏరోస్పేస్ కొత్త తయారీ ప్రాజెక్ట్
Drone manufacturing India | డ్రోగో ఏరోస్పేస్ కొత్త తయారీ ప్రాజెక్ట్
Drone manufacturing India | తెలంగాణ ప్రభుత్వం కేటాయించిన భూమి వివరాలు
ఉపాధి అవకాశాలు మరియు విస్తరణ ప్రణాళిక
డ్రోన్ నుంచి ఏరోస్పేస్ సంస్థగా మార్పు
రక్షణ రంగంలో సంస్థ అభివృద్ధి
రాజ్‌నాథ్ సింగ్, చంద్రబాబు ప్రశంసలు
Drone manufacturing India | హైదరాబాద్, ఆంధ్రప్రభ: అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో డ్రోన్ తయారీ కేంద్రాన్ని రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నట్లు డ్రోగో ఏరోస్పేస్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ యశ్వంత్ బొంతు తెలిపారు. ఇది అత్యాధునిక సాంకేతికతతో కూడిన ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోంది.
డ్రోన్ల తయారీకి తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో నాలుగున్నర ఎకరాల భూమిని డ్రోగో ఏరోస్పేస్‌కు కేటాయించింది. ఇప్పటికే తమ సంస్థలో 300 మంది పని చేస్తున్నారని, నూతన తయారీ కేంద్రంలో మరో 500 మందికి ఉపాధి లభిస్తుందని ఆయన తెలిపారు.
దేశంలో స్వదేశీ ఏరోస్పేస్, రక్షణ సాంకేతిక సంస్థగా ఎదగడమే తమ సంస్థ పేరు మార్పు వెనుకనున్న లక్ష్యమని చెప్పారు. డ్రోన్ తయారీ, సేవలకే పరిమితం కాకుండా, భవిష్యత్ రక్షణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో కూడిన రక్షణ వ్యవస్థలను తమ సంస్థ అభివృద్ధి చేస్తోందని అన్నారు.
భారత సైన్యానికి తొలి విడతగా 41 జేకే 250ఈ డ్రోన్లను నాసిక్‌లో అధికారులకు అందించడం తమ సంస్థకు గర్వకారణంగా మారిందని చెప్పారు. హైదరాబాద్‌లోని మాదాపూర్ కేంద్రంగా పనిచేస్తున్న డ్రోగో డ్రోన్స్ సంస్థ ఇటీవల తన పేరును డ్రోగో ఏరోస్పేస్‌గా మార్చింది. డ్రోన్ తయారీ సంస్థ నుంచి సమగ్ర రక్షణ, విమానాలు, ఉపగ్రహాలు, డ్రోన్లు, అంతరిక్ష నౌకల రూపకల్పన, తయారీ, నిర్వహణకు తోడ్పడే మొత్తం సాంకేతిక, పారిశ్రామిక పరిశోధనా కేంద్రం (ఏరోస్పేస్ టెక్నాలజీ ఎకోసిస్టమ్)గా అభివృద్ధి చెందింది.
రక్షణ, నిఘా, తదుపరి తరం మానవరహిత వైమానిక వ్యవస్థల అభివృద్ధిపై సంస్థ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఏరోస్పేస్ సంస్థ సీఈఓ యశ్వంత్ బొంతు మాట్లాడుతూ, డ్రోగో ఏరోస్పేస్‌గా తమ కొత్త ప్రయాణంలో రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో విస్తృతంగా సేవలు అందించాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు.
రక్షణ మంత్రి రాజ్‌నాథ్, ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్‌లోని పుట్టపర్తి జిల్లాలో ఇటీవల జరిగిన రక్షణ ఉత్పత్తుల కేంద్రం, డ్రోన్సిటీ శంకుస్థాపన కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనలో డ్రోగో ఏరోస్పేస్ తన ఉత్పత్తులను ప్రదర్శించింది. వాటిని పరిశీలించిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏపీ సీఎం నారా చంద్రబాబు సంస్థ పనితీరును ప్రశంసించారు. సీఈఓ యశ్వంత్ బొంతు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
