Tenant farmers Andhra Pradesh | ఖరీఫ్ సీజన్‌లో పెరిగిన సమస్యలు
Tenant farmers Andhra Pradesh | ఖరీఫ్ సీజన్‌లో పెరిగిన సమస్యలు
Tenant farmers Andhra Pradesh | భూయజమానుల సహకారం లేక ఇబ్బందులు
కార్డుల జారీ లక్ష్యాలు – వాస్తవ పరిస్థితి
సాగు హక్కుదారుల చట్టంపై విమర్శలు
కౌలు రైతుల భవిష్యత్‌పై అనిశ్చితి
Tenant farmers Andhra Pradesh | అమరావతి, ఆంధ్రప్రభ: ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో కౌలు రైతులకు సిసిఆర్సి కార్డులు కష్టాలను తెచ్చిపెడుతున్నాయి. ఒక పక్క సాగు ఖర్చు పెరగడంతో రుణభారం అధికమవుతోంది. సాగును ముందుకు సాగించాలంటే బ్యాంకు రుణాలపై ఆధారపడాలి. అయితే ఆర్థిక సంస్థలు కౌలు రైతులను కరుణించని పరిస్థితి నెలకొంది.
కౌలు రైతులకు సిసిఆర్సి కార్డులు లేకపోతే ప్రభుత్వ రాయితీలు, బీమా, పెట్టుబడి సాయానికి దూరమవుతారు. కార్డులు ఇవ్వకుండా కౌలు రైతులను బ్యాంకుల చుట్టూ, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల చుట్టూ తిరిగేలా ప్రభుత్వం చేస్తోందన్న తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గతేడాది పది లక్షల మందికి సిసిఆర్సి కార్డులను జారీ చేయాలని లక్ష్యంగా నిర్ణయించగా, 5.99 లక్షల మందికి మాత్రమే కార్డులు అందించారు. కార్డుల జారీకి లక్ష్యాలు తీసుకుంటున్నా ఏ సంవత్సరమూ వాటిని చేరుకోలేని పరిస్థితి నెలకొంది.
టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024లోనూ పది లక్షల మందికి కార్డులు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ధేశించుకుని 8.31 లక్షల మందికే ఇచ్చారు. 2025లో కూడా పది లక్షల కార్డులు ఇవ్వాలని నిర్ధేశించుకున్నా 5.99 లక్షల మందికే ఇచ్చారు. ఈ ఏడాది మళ్లీ అదే పది లక్షల లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. అయితే ఇప్పటివరకు కార్డుల ప్రక్రియ వేగవంతం కాకపోవడంతో కౌలు రైతుల్లో ఆందోళన నెలకొంది.
సహకరించని భూయజమానులు
ఖరీఫ్ పనులు ప్రారంభమవుతున్నా సిసిఆర్సి కార్డుల జారీకి గ్రామాల్లో సభలు నిర్వహించి కొత్తగా కార్డులు ఇవ్వాల్సిన ప్రభుత్వం అటువంటి ప్రక్రియ చేపట్టిన దాఖలాలు కనిపించడం లేదు. కొన్ని జిల్లాల్లో గ్రామాల్లో సభలు నిర్వహించకపోవడం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తోంది.
కార్డుల రెన్యువల్ అక్కడక్కడా జరుగుతున్నా కొత్త కార్డుల జారీ నిలిచిపోయింది. కొత్త కార్డులు ఇవ్వడానికి యజమానులు అంగీకారం తెలపకపోవడమే ప్రధాన కారణంగా కనిపిస్తోంది. కార్డుల కోసం సంతకాలు అడుగుతుంటే కొత్త వారికి కౌలుకు ఇచ్చుకుంటామంటూ యజమానులు బెదిరింపులకు దిగుతున్నారని రైతులు చెబుతున్నారు.
దీంతో గ్రామాల్లో పరస్పర అంగీకారంతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్న పరిస్థితి నెలకొంది. వాటినే ప్రభుత్వం కార్డుల జారీగా లెక్కల్లో చూపుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కౌలు రైతులు ఏమిచేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. యజమానులు ఆగ్రహిస్తే కౌలుకు భూమి ఇవ్వడం కష్టమవుతుందన్న భయంతో వారు కార్డుల కోసం పెద్దగా డిమాండ్ చేయడంలేదు.
భరోసా ఇవ్వని సాగు చట్టం
2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన సాగు హక్కుదారుల చట్టం–2019 చట్టం ఫలితం ఇవ్వలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కౌలు రైతులకు గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియను సులభతరం చేస్తామని చెప్పినా భూయజమానుల అంగీకారంపైనే ఆధారపడే పరిస్థితి కొనసాగింది.
సంతకాలు చేసేందుకు భూ యజమానులు ముందుకు రాకపోవడంతో లక్ష్యాల మేర కార్డులు అందించలేకపోయారు. 2024లో అధికారంలోకి వచ్చిన టిడిపి కూటమి ప్రభుత్వం సాగు హక్కుదారుల చట్టాన్ని సవరించి కౌలు రైతులకు అన్ని సౌకర్యాలు అందిస్తామని ప్రకటించినప్పటికీ, అమలు విషయంలో విఫలత కొనసాగుతోంది.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చినా రెండేళ్లు గడిచినా అమలు జరగకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జనసేన కూడా ఎన్నికల ముందు కౌలు రైతుల సంక్షేమంపై హామీలు ఇచ్చినా, అధికారంలోకి వచ్చాక పరిస్థితి మారలేదని విమర్శలు ఉన్నాయి. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు లేకపోవడం వల్ల అన్నదాత సుఖీభవ, బ్యాంకు పంట రుణాలు, పంట అమ్మకాల సమయంలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
