138 buses | స్టూడెంట్స్ ఉరుకులు, పరుగులు
138 buses | స్టూడెంట్స్ ఉరుకులు, పరుగులు
విద్యార్థుల రాకతో పాఠశాల, కాలేజీలకు కొత్త కళ
పిల్లలకు బ్రేక్ ఫాస్ట్‌తో స్వాగతం చెప్పిన ప్రభుత్వం
ఇంటర్ విద్యార్ధులకూ మధ్యాహ్నం భోజనం
తెలంగాణలో మొత్తం 41, 673 పాఠశాలలు, 63 లక్షల మంది విద్యార్ధులు
విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు రేవంత్ శుభాకాంక్షలు
138 buses | హైదరాబాద్, ఆంధ్రప్రభ : వేసవి సెలవుల అనంతరం తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యాయి. సుదీర్ఘ సెలవుల తర్వాత రీ ఓపెన్ కావడంతో విద్యాసంస్థలన్నీ సందడిగా.. కొత్త కళ సంతరించుకున్నాయి. నేటి నుంచి ఎంపికచేసిన జిల్లాలోని బడి పిల్లలకు బ్రేక్ ఫాస్ట్‌ను కూడా అందిస్తున్నారు. అలాగే.. ఇంటర్ విద్యార్ధులకు మధ్యాహ్న భోజనం పథకాన్ని అమలు చేయనున్నారు.. ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు 41, 673 పాఠశాలల్లో 63 లక్షల మందికి పైగా విద్యార్థులు తరగతులకు హాజరు కానున్నారు. ఇందులో ప్రభుత్వ పాఠశాలలు దాదాపు 26వేలు ఉండగా. వాటిలో సుమారు 21.5 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ విద్యా సంవత్సరం విద్యార్థులకు మరింత నాణ్యమైన సౌకర్యాలు అందించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు బ్రాండెడ్ యూనిఫామ్‌లు, షూస్, బెల్ట్, టై, బ్యాగులతో కూడిన ప్రత్యేక కిట్లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.

138 buses | ఇంటర్ విద్యార్ధులకూ యూనిఫామ్
చరిత్రలో ఎన్నడూ లేని విధంగా.. ఈ ఏడాది ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదివే దాదాపు 2 లక్షల మంది విద్యార్థులకు కాలేజీ బ్యాగ్, బూట్లు, సాక్సులు, టై, బెల్టులను ప్రభుత్వం ఉచితంగా అందిస్తుంది. పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రతకు అధికారులు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు. స్కూల్ బస్సులు, వ్యాన్లు, ఇతర రవాణా వాహనాలపై రవాణా శాఖ అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. నెల రోజులుగా ఈ వాహనాలకు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేకుండా రోడ్డెక్కితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో బస్సులను నిలిపివేసి తనిఖీలు చేపట్టారు. ఫిట్ నేస్, ఇతర కారణాలతో 138 బస్సులను నిలిపివేశారు అధికారులు.

138 buses | ఆర్టీసీ బస్సులు పెంపు
విద్యార్థులకు రవాణా ఇబ్బందులు కలగకుండా టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని రూట్లలో విద్యార్థుల రద్దీకి అనుగుణంగా తగినన్ని బస్సులను నడపాలని ఆర్టీసీ ఎండీ వై.నాగరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 227 పనిదినాలు ఉన్నందున.. విద్యార్థులు సకాలంలో, సురక్షితంగా తమ పాఠశాలలకు చేరుకునేలా రవాణా సౌకర్యాలను సిద్ధం చేసినట్లు తెలిపారు. ఉదయం, సాయంత్రం వేళల్లో అదనపు బస్సులు నడుపుతున్నట్లు ప్రకటించారు.

138 buses | విద్యార్ధులకు సీఎం రేవంత్ శుభాకాంక్షలు..
వేసవి సెలవుల అనంతరం మళ్లీ బడి బాట పట్టిన విద్యార్థులందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థినీ విద్యార్థులకు, అధ్యాపకులకు అభినందనలు తెలిపారు. “పాఠశాల అనేది కేవలం చదువులు నేర్చుకునే స్థలం మాత్రమే కాదు. మన వ్యక్తిత్వాన్ని, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే ఆలయం. ప్రతి పుస్తకం ఒక కొత్త ప్రపంచానికి తలుపు లాంటిది. ప్రతి పాఠం ఒక కొత్త అవకాశానికి మార్గం. విద్య మన భవిష్యత్తుకు వెలుగు నింపే శక్తి. తరగతి గదుల్లోనే దేశ భవిష్యత్తు ఉందని విశ్వసిస్తాను. అందుకే అత్యున్నత ప్రమాణాలతో విద్యారంగం విలసిల్లాలని అనేక సంస్కరణలు చేపట్టాం. ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం వంటి పోషకాలతో కూడిన ఆహారం అందించడమే కాకుండా అనేక చర్యలు చేపట్టాం” అని తన సందేశంలో పేర్కొన్నారు.
ప్రైవేట్ ఫీజులపై కీలక ఆదేశాలు..
ప్రైవేట్ స్కూళ్లు, ఇంటర్ కాలేజీల్లో ఫీజుల నియంత్రణకు కఠినమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. వసతులు, మౌలిక సదుపాయాల ఆధారంగా పాఠశాలలను మూడు కేటగిరీలుగా విభజించి గరిష్ఠ ఫీజులను ఖరారు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని, ఈ నెలలోనే కొత్త రూల్స్ తెచ్చేందుకు కసరత్తు జరుగుతోందని సమాచారం.
click here to read more : Russia Ukraine War | డ్రోన్లు, మిస్సైళ్లతో భారీ అటాక్
