AP Liquor Scam Case | రాజ్ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డికి రిమాండ్..
AP Liquor Scam Case | రాజ్ కేసిరెడ్డి, వాసుదేవరెడ్డికి రిమాండ్..
- ఈ నెల 25 వరకు జ్యుడీషియల్ రిమాండ్..
- చంచల్‌గూడ జైలుకు తరలింపు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఆంధ్రప్రదేశ్ లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ స్కాం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు వేగం పెంచింది. ఈ కేసులో అరెస్టైన రాజ్ కేసిరెడ్డి, మాజీ ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డిని గురువారం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఇద్దరికీ ఈ నెల 25వ తేదీ వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. అనంతరం వారిని చంచల్‌గూడ సెంట్రల్ జైలుకి తరలించారు.
3,500 కోట్ల నిధుల మళ్లింపుపై ఈడీ ఆరా
కాగా, గతంలో ఏపీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) సమర్పించిన నివేదికల ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది. మద్యం కంపెనీల నుంచి ముడుపుల రూపంలో వసూలు చేసిన సుమారు రూ.3,500 కోట్ల అవినీతి సొమ్మును బినామీ సంస్థలు, షెల్ కంపెనీలు, హవాలా నెట్‌వర్క్ ద్వారా రియల్ ఎస్టేట్, జ్యువెలరీ తదితర రంగాలకు మళ్లించినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఈ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాల కోసం పలుచోట్ల సోదాలు నిర్వహిస్తోంది.
ఇదే కేసుకు సంబంధించి 2026 మే 22న ECIR/HYZO/17/2026 నంబరుతో ప్రత్యేక మనీలాండరింగ్ కేసును ఈడీ నమోదు చేసింది. ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టుల కేటాయింపులో జరిగినట్లు ఆరోపణలు ఉన్న అక్రమాల కారణంగా ప్రభుత్వ ఖజానాకు సుమారు రూ.195.33 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు పేర్కొంది. అదే సమయంలో కొందరికి అక్రమంగా భారీ ఆర్థిక ప్రయోజనాలు చేకూరినట్లు అనుమానాలు వ్యక్తం చేసింది.
తాజా సోదాల్లో కీలక డిజిటల్ పరికరాలు, బ్యాంకు లావాదేవీలకు సంబంధించిన పత్రాలు, ఆస్తుల కొనుగోళ్లు, నిధుల మళ్లింపుకు సంబంధించిన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. వీటి విశ్లేషణ అనంతరం మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
10 ప్రాంతాల్లో సోదాలు..
ఏపీ లిక్కర్ ట్రాన్స్‌పోర్ట్ స్కాం కేసు దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం ఏపీ,తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో విస్తృత సోదాలు నిర్వహించారు. నార్సింగి, మంచిరేవుల ప్రాంతాలతో పాటు మొత్తం 10 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు.
మద్యం కుంభకోణానికి సంబంధించి గురువారం ఉదయం నుంచే ఈ సోదాలు కొనసాగాయి. కేసులో కీలక వ్యక్తులుగా దర్యాప్తు సంస్థ పేర్కొంటున్న ఆరుగురి నివాసాలు, కార్యాలయాలను లక్ష్యంగా చేసుకుని అధికారులు గాలింపు చేపట్టారు.
నిందితులు రాజ్ కెసిరెడ్డి, ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, విజయనర్సింహారెడ్డి, వల్లు సందీప్, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడి ఇళ్లలో సోదాలు చేసినట్లు ఈడీ వెల్లడించింది. నిందితులు ప్రభుత్వ ఖజానాకు రూ.195.33 కోట్ల మేర నష్టం కలిగించినట్లు దర్యాప్తులో వెల్లడైందని ఈడీ తెలిపింది.
ట్రాన్స్‌పోర్ట్ కాంట్రాక్టుల కేటాయింపు, షెల్ కంపెనీల ద్వారా నిధుల మళ్లింపు, అక్రమ ఆస్తుల కొనుగోళ్లు, బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించిన కీలక ఆధారాల కోసం సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఈ సందర్భంగా నగదు, పలు కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వీటి పూర్తి వివరాలను ఈడీ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
సోదాల్లో సుదర్శన్ ఫర్మ్‌కు రూ.73 కోట్లు అందినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడికి రూ.15 కోట్ల నగదు బ్యాంకింగ్ మార్గాల ద్వారా చేరిందని ఈడీ గుర్తించినట్లు సమాచారం. మద్యం రవాణా టెండర్‌లో సిగ్మా సప్లయి చైన్ సొల్యూషన్స్ ఫ్రంట్ కంపెనీగా ఉపయోగించినట్లు ఈడీ గుర్తించినట్లు తెలుస్తోంది. రవాణా ఆదాయంలో 95-96శాతం సిండికేట్‌కు, కేవలం 4శాతం సిగ్మాకు వెళ్లినట్లు గుర్తించింది. కారుమూరి నాగేశ్వరరావు ఇంట్లో ఖరీదైన రెండు రోలెక్స్ వాచ్‌లు, కారు, మొబైల్, జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ కాపీని ఈడీ సీజ్ చేసింది.
కారుమూరి నాగేశ్వరరావు నివాసంలో నిర్వహించిన తనిఖీల్లో రెండు రోలెక్స్ వాచ్‌లు, ఒక రేంజ్ రోవర్ వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్టు ఈడీ అధికారులు తెలిపారు. అలాగే అక్కడ లభించిన ఒక మొబైల్ ఫోన్, జాయింట్ వెంచర్ అగ్రిమెంట్ కాపీని ఈడీ సీజ్ చేసింది. మొబైల్ ఫోన్ నుంచి హవాలా లావాదేవీలకు సంబంధించిన చాటింగ్‌ను రికవర్ చేసినట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు.
