Sangareddy మీనాక్షి నామినేషన్ రద్దుపై బీజేపీ కుట్ర: జగ్గారెడ్డి

Sangareddy మీనాక్షి నామినేషన్ రద్దుపై బీజేపీ కుట్ర: జగ్గారెడ్డి

Sangareddy సంగారెడ్డి, ఆంధ్రప్రభ: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వ్యవహారం ప్రజాస్వామ్య వ్యవస్థలో “మాయని మచ్చ”గా నిలుస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి. జగ్గారెడ్డి తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యవహారంలో ప్రధాని స్థాయిలో కుట్రలు జరిగాయని ఆయన ఆరోపించారు.

ఒక రాజ్యసభ సీటు కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలకు పాల్పడిందని జగ్గారెడ్డి మండిపడ్డారు. గాంధేయ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేసే మహిళా నేత మీనాక్షి నటరాజన్‌ను లక్ష్యంగా చేసుకుని ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్నారని వ్యాఖ్యానించారు.

నామినేషన్ తిరస్కరణపై స్పందిస్తూ, “లేని కేసును ఉన్నట్టుగా చూపించి తిరస్కరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం” అని ఆయన అన్నారు. గత 12 ఏళ్ల బీజేపీ పాలనలో పరిపాలన కంటే కుట్ర రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు.

ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని కాంగ్రెస్‌కు రావాల్సిన రాజ్యసభ స్థానాన్ని అడ్డుకున్నారని ఆరోపించారు. చిన్న ప్రైవేట్ ఫిర్యాదును సాకుగా చూపి నామినేషన్ తిరస్కరించడం సరైన విధానం కాదని స్పష్టం చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలో ఉన్న నేపథ్యంలో ఉద్యోగాలు, నల్లధనం వంటి హామీల అమలుపై దృష్టి పెట్టాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఒక రాజ్యసభ సీటు కోసం దిగజారుడు రాజకీయాలు చేయడం సరికాదని వ్యాఖ్యానించారు.

బీఆర్ఎస్ నేత హరీశ్ రావు వ్యాఖ్యలపై స్పందిస్తూ, ప్రతిపక్ష నాయకుడిగా బీజేపీ చర్యలను ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. మహిళా నేతకు జరిగిన అన్యాయంపై ప్రశ్నించే బాధ్యత లేదా అని ప్రశ్నించారు.

కాంగ్రెస్‌లో కోవర్టులు ఉన్నారనే ఆరోపణలను ఆయన ఖండిస్తూ, బీజేపీ తనపై వచ్చిన విమర్శల నుంచి దృష్టి మళ్లించేందుకే అలాంటి ప్రచారం చేస్తోందని అన్నారు. పార్టీలో ఎవరైనా కోవర్టులుగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Leave a Reply