ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి
ప్రపంచ స్థాయి నగరంగా అమరావతి
ఎమ్మెల్యే గద్దె రామమోహన్
పటమట, ఆంధ్రప్రభ : అమరావతిని ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ తెలిపారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహకారంతో రాజధాని నిర్మాణం వేగంగా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. గురువారం అశోక్ నగర్‌లోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద, స్థానిక 12వ డివిజన్‌కు చెందిన నిరుపేద పార్టీ కార్యకర్త గాడి కాశికి ఎమ్మెల్యే తన సొంత నిధులతో కొనుగోలు చేసిన సైకిల్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమరావతిలో ప్రతి అంగుళం భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆదర్శవంతంగా నిర్మిస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రణాళికాబద్ధంగా రాజధాని అభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అమరావతిలో కేంద్ర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు, నివాస సముదాయాల నిర్మాణానికి కేంద్రం రూ.2,500 కోట్లు కేటాయించడం అభినందనీయమని ఆయన అన్నారు.
అలాగే కేంద్ర విద్యాసంస్థలు కూడా ఏర్పాటు కానున్నాయని వివరించారు. అమరావతిని కేవలం రాజధానిగానే కాకుండా టూరిజం హబ్‌గా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ ద్వారా వచ్చే ఆదాయాన్ని రాష్ట్ర అభివృద్ధికి వినియోగిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
