Sangareddy ప్లాస్టిక్‌పై పోరు మొదలైంది!
Sangareddy ప్లాస్టిక్‌పై పోరు మొదలైంది!
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని పిలుపు
సంగారెడ్డి (Sangareddy), ఆంధ్రప్రభ: ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలని పర్యావరణ ఇంజినీర్ ఎన్. విజయలక్ష్మి సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సంగారెడ్డి ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా గురువారం పలు అవగాహన, పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యంగా నిలిచింది.
తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల సహకారంతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే దుష్ప్రభావాలు, పర్యావరణ పరిరక్షణ అవసరం, ప్రత్యామ్నాయ ఉత్పత్తుల వినియోగంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సుమారు 30 మంది విద్యార్థులు పాల్గొన్నారు.
గుండ్లమాచనూర్ గ్రామంలో ఎం/ఎస్ అపిటోరియా ఫార్మా లిమిటెడ్, ఎం/ఎస్ హానర్ ల్యాబ్స్ లిమిటెడ్, ఎం/ఎస్ కోవలెంట్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు సంయుక్తంగా ప్లాస్టిక్ రహిత పర్యావరణం కోసం అవగాహన ర్యాలీ నిర్వహించాయి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణహిత జీవనశైలిని అవలంబించాలని ప్రజలకు పిలుపునిచ్చాయి.
జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఐలా, పాశమైలారం ఆధ్వర్యంలో ఇస్నాపూర్ చెరువు వద్ద, ఎంఎస్ఎన్ లాబొరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రుద్రారం చెరువు వద్ద ప్రత్యేక పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే గుండ్లమాచనూర్ గ్రామంలో అపిటోరియా ఫార్మా, హానర్ ల్యాబ్స్, కోవలెంట్ లాబొరేటరీస్ సంస్థలు ప్లాస్టిక్ వ్యర్థాల సేకరణ చేపట్టి, వ్యర్థాల వేరు చేయడం, సరైన నిర్వహణపై ప్రజలకు అవగాహన కల్పించాయి.
సంగారెడ్డి పట్టణంలోని పలు ప్రాంతాల్లో వివిధ పరిశ్రమలు ప్లాస్టిక్ వ్యర్థాల తొలగింపు, పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించి ప్రజా ప్రదేశాలను శుభ్రపరిచాయి. పర్యావరణ పరిరక్షణలో పరిశ్రమలు, విద్యాసంస్థలు, ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని ఈ కార్యక్రమాలు స్పష్టం చేశాయి.
ఈ సందర్భంగా తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఉపయోగించగల వస్త్ర సంచులు, స్టీల్ పాత్రలు, గాజు సీసాలు, జీవావక్షేయ ఉత్పత్తులతో ప్రత్యేక ప్రదర్శన స్టాల్‌ను ఏర్పాటు చేశారు. తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు, సిబ్బందికి వస్త్ర సంచులను పంపిణీ చేశారు.
