అర్హులైన వారంతా ఓటర్ల జాబితాలో ఉండాలి

అర్హులైన వారంతా ఓటర్ల జాబితాలో ఉండాలి

జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)-2026 పై శిక్షణ

శ్రీకాకుళం, ఆంధ్రప్రభ : అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో నమోదు అయ్యేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సూచించారు. స్వచ్ఛమైన, ఖచ్చితమైన ఓటర్ల జాబితా తయారీ కోసం అందరూ సమన్వయంతో పనిచేయాలని ఆయన అన్నారు.

జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గురువారం ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్)-2026 (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్-2026) ప్రక్రియపై జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహమ్మద్ ఖాన్‌తో కలిసి ఈఆర్‌వోలు, ఏఈఆర్‌వోలు, సూపర్‌వైజర్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బీఎల్‌వోలకు కేటాయించిన గృహాల్లో ఇంటింటి ఎన్యూమరేషన్‌ను విజయవంతంగా నిర్వహించాలని ఆదేశించారు.

బీఎల్‌వోలు ఎన్యూమరేషన్ ఫారాల నిర్వహణకు ప్రత్యేక ఫైల్ నిర్వహించాలని, ఫారాలు 6, 7, 8లకు తప్పనిసరిగా అంగీకార రసీదు (అక్నాలెడ్జ్‌మెంట్) ఇవ్వాలని సూచించారు. కార్యాలయాల్లో బీఎల్‌వోలు, ఏఈఆర్‌వోలు కూర్చునే స్థానాలను ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న సిబ్బందిని అందుబాటులో ఉంచాలని చెప్పారు. ఫైళ్ల నిర్వహణను ఇప్పటి నుంచే ప్రారంభించాలని ఆదేశించారు.

జూలై 1, 2026 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడిని ఓటరుగా నమోదు చేయాలని పేర్కొన్నారు. బీఎల్‌వోలు ఇంటింటి సర్వేను జూలై 14 నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. పోలింగ్ స్టేషన్ల హేతుబద్ధీకరణ జూలై 14 నాటికి పూర్తిచేయాలని, ఎలక్టోరల్ డ్రాఫ్ట్ ప్రచురణ జూలై 21న చేపట్టనున్నట్లు తెలిపారు.

జూలై 21 నుంచి ఆగస్టు 20 వరకు క్లెయిమ్‌లు, అభ్యంతరాలు స్వీకరిస్తామని, వాటి పరిష్కారం సెప్టెంబర్ 18 వరకు కొనసాగుతుందని చెప్పారు. తుది ఓటర్ల జాబితా సెప్టెంబర్ 22న ప్రచురించనున్నట్లు వివరించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రతి వారం సమావేశాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

జిల్లా రెవెన్యూ అధికారి వి. విశ్వేశ్వరరావు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో ఓటరు నమోదు, పోస్ట్ డ్రాఫ్ట్ విధానం, డిక్లరేషన్ ఫారం, క్లెయిమ్‌లు, అభ్యంతరాలు, ఫారాలు 6, 7, 8 తదితర అంశాలపై అధికారులకు వివరించారు. ఎలక్టోరల్ మ్యాపింగ్‌లో మిగిలిన అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక సమగ్ర సవరణ-2026లో భాగంగా ఎలక్టోరల్ మ్యాపింగ్‌లో శ్రీకాకుళం జిల్లా ప్రథమ స్థానం సాధించడంపై ఎన్నికల అధికారులను కలెక్టర్ అభినందించారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు (ఈఆర్‌వోలు) కె. సాయి ప్రత్యూష, డిప్యూటీ కలెక్టర్లు పద్మావతి, జి. జయదేవి, లక్ష్మణమూర్తి, లావణ్య, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హెచ్. కూర్మారావు, జిల్లా పరిషత్ సీఈఓ వెంకటరామన్, తహసీల్దార్లు, సూపర్‌వైజర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply