Nagarkurnool మీనాక్షి నటరాజన్ నామినేషన్ ఆమోదించాలి
Nagarkurnool మీనాక్షి నటరాజన్ నామినేషన్ ఆమోదించాలి
- ఎన్నికల కమిషన్‌కు కాంగ్రెస్ నేతల విజ్ఞప్తి
నాగర్‌కర్నూల్ (Nagarkurnool), ఆంధ్రప్రభ
కాంగ్రెస్ పార్టీ జాతీయ నేత, తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ రాజ్యసభ నామినేషన్‌ను తిరిగి స్వీకరించాలని ఎన్నికల కమిషన్‌ను కోరుతున్నట్లు నాగర్‌కర్నూల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, నాగర్‌కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి, పార్టీ శిక్షణ కార్యక్రమాల ఇన్చార్జి సిద్దేశ్వర్ తెలిపారు.
బుధవారం సాయంత్రం నాగర్‌కర్నూల్ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బీజేపీ కుట్రపూరితంగా, ఫాసిస్టు ధోరణితో వ్యవహరిస్తూ చిన్న అభియోగాన్ని ఆధారంగా చేసుకుని, మీనాక్షి నటరాజన్‌కు సంబంధం లేని కేసును చూపించి ఆమె నామినేషన్‌ను తిరస్కరింపజేసిందని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్య విరుద్ధ చర్య అని విమర్శించారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట కాంగ్రెస్ అధ్యక్షుడు నారాయణరెడ్డి కేసులో ఒక వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని అభియోగంగా చూపించారని పేర్కొన్నారు. ఆ కేసుకు మీనాక్షి నటరాజన్‌కు ఎలాంటి సంబంధం లేదని, ఆమె కేవలం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి మాత్రమేనని డాక్టర్ వంశీకృష్ణ స్పష్టం చేశారు.
దేశంలో బీజేపీ కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని, బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తోందని, ఓటు చోరీ, సీటు చోరీకి పాల్పడుతోందని వారు ఆరోపించారు. కాంగ్రెస్‌కు మద్దతుగా ఉన్న వర్గాల ఓట్లను జాబితాల నుంచి తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు.
బీజేపీ అరాచకాలను ఎదుర్కోవడంతో పాటు ఓట్ల తొలగింపును అడ్డుకునేందుకు రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సిద్దేశ్వర్ తెలిపారు.
నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీ డాక్టర్ మల్లు రవి ఆధ్వర్యంలో బస్సు యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ యాత్ర ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని చెప్పారు. ఇప్పటికే నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలో రెండు మండలాల్లో కార్యక్రమం పూర్తయిందని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ సునీంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు, కాంగ్రెస్ నాయకులు జక్కా రాజు, వంకేశ్వరం నిరంజన్, శ్రీనివాస్ రెడ్డి, మల్లయ్య గౌడ్, మాధవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
