సింగరేణిలో ఆరుగురు సివిల్ అధికారుల బదిలీ
సింగరేణిలో ఆరుగురు సివిల్ అధికారుల బదిలీ
-డీవైజీఎం మదీనాభాషకు మందమర్రి పోస్టింగ్
-ఉత్తర్వులు జారీ చేసిన జీఎం పర్సనల్
బెల్లంపల్లి, ఆంధ్రప్రభ: సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ఆరుగురు సివిల్ విభాగం అధికారులను వివిధ ఏరియాలకు బదిలీ చేస్తూ జీఎం (పర్సనల్) ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా అవసరాల దృష్ట్యా ఈ బదిలీలు చేపట్టినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి.
బెల్లంపల్లి ఏరియాలో డీవైజీఎం (సివిల్)గా పనిచేస్తున్న షేక్ మదీనాభాషను మందమర్రి ఏరియాకు బదిలీ చేశారు. మందమర్రి ఏరియాలో సివిల్ ఎస్ఈగా విధులు నిర్వహిస్తున్న సంగోజు శ్రీధర్‌ను బెల్లంపల్లి ఏరియాకు నియమించారు.
అలాగే మణుగూరు ఏరియాలో డిప్యూటీ ఎస్ఈ (సివిల్)గా పనిచేస్తున్న డి. వసంతసూర్య నాగ ప్రవీణ్‌ను కార్పొరేట్ సివిల్ విభాగానికి బదిలీ చేశారు. కార్పొరేట్ కార్యాలయంలో డిప్యూటీ ఎస్ఈ (సివిల్)గా ఉన్న లాకావత్ సరితను కొత్తగూడెం కార్పొరేట్ విభాగానికి మార్చారు.
బెల్లంపల్లి ఏరియాలో ఈఈ (సివిల్)గా పనిచేస్తున్న కందగట్ల రాజేంద్రప్రసాద్‌ను మణుగూరు సివిల్ విభాగానికి, కొత్తగూడెం కార్పొరేట్లో ఏఈ (సివిల్)గా పనిచేస్తున్న బైరి క్రాంతిని బెల్లంపల్లి ఏరియాకు బదిలీ చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
బదిలీల రద్దుకు ప్రయత్నాలు?
ఇదిలా ఉండగా, తాజాగా జారీ చేసిన బదిలీ ఉత్తర్వులను రద్దు చేయించుకునేందుకు కొందరు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం పనిచేస్తున్న ఏరియాల్లోనే కొనసాగేందుకు ఉన్నతస్థాయిలో సంప్రదింపులు జరుపుతున్నారని సంస్థ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ముఖ్యంగా బెల్లంపల్లి రీజియన్‌లోని ఓ కీలక ఏరియాలో పనిచేస్తున్న ఒక అధికారి, తన బదిలీని నిలిపివేయించుకునేందుకు ప్రభావవంతమైన వర్గాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై సింగరేణి యాజమాన్యం నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన వెలువడలేదు.
