ప్రజల సంతృప్తే పనితీరుకు గీటురాయి..

ప్రజల సంతృప్తే పనితీరుకు గీటురాయి..

సేవల నాణ్యతే సుప‌రిపాల‌న‌కు స‌రైన ప్రమాణం
అర్జీల పరిష్కారంలో జవాబుదారీతనంతో వ్యవహరించాలి
నిర్ల‌క్ష్యం, బాధ్య‌తారాహిత్యం క‌నిపిస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు
జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌

విజయవాడ, ఆంధ్రప్రభ : అర్జీల ప‌రిష్కారంలో ప్రజల సంతృప్తే ప‌నితీరుకు గీటురాయ‌ని.. సేవ‌ల నాణ్య‌తే సుప‌రిపాల‌న‌కు స‌రైన ప్ర‌మాణ‌మ‌న్న విష‌యాన్ని గుర్తించి అధికారులు ప్ర‌జ‌ల ఫిర్యాదుల ప‌రిష్కారంపై ప్ర‌త్యేక దృష్టిపెట్టాల‌ని క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ ఆదేశించారు. సోమ‌వారం క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో ప్ర‌జా స్నేహ‌పూర్వ‌క పీజీఆర్ఎస్ కార్య‌క్ర‌మం జ‌రిగింది. అంత‌కుముందు క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ శాఖ‌ల వారీగా అర్జీల ప‌రిష్కారంపై స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఇంత‌వ‌ర‌కు ఎన్ని అర్జీలు అందాయి? ఎన్ని ప‌రిష్క‌రించారు? ప‌రిష్కార నాణ్య‌త‌.. త‌దిత‌ర అంశాలను ప‌రిశీలించారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ప్ర‌తి అర్జీ స‌త్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని.. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను మరింత ప్రజాస్నేహపూర్వకంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు.

ఫిర్యాదుల పరిష్కారం అనంతరం జిల్లాస్థాయి అధికారులు స్వయంగా ఫిర్యాదుదారులతో మాట్లాడి, సమస్య పరిష్కారంపై వారి అభిప్రాయాలను తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఫిర్యాదుల పరిష్కార నాణ్యతపై పూర్తి బాధ్యత సంబంధిత అధికారులదేనని స్పష్టం చేశారు. అర్జీల ప‌రిష్కారంలో నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యం క‌నిపిస్తే సహించేది లేద‌ని హెచ్చ‌రించారు. అర్జీలు పున‌రావృతం కాకుండా చూసుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. ఫిర్యాదులను స్వీకరించే సమయంలోనూ, పరిష్కరించే ప్రక్రియలోనూ అధికారులు నిబద్ధత, సహానుభూతితో వ్యవహరించాలని ఆదేశించారు. ప్రజల విశ్వాసాన్ని పెంపొందించే విధంగా సేవలు అందించడమే ప్రతి అధికారి ప్రధాన బాధ్యతగా భావించాలని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ సూచించారు.

జిల్లాస్థాయి కార్య‌క్ర‌మానికి 151 అర్జీలు..

ప్ర‌జా స్నేహ‌పూర్వ‌క పీజీఆర్ఎస్‌లో క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌.. జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ‌, అధికారుల‌తో క‌లిసి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వ‌చ్చిన ప్ర‌జ‌ల నుంచి అర్జీలు స్వీక‌రించారు. మొత్తం 151 అర్జీలు రాగా.. వీటిలో పుర‌పాల‌న‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌కు 33, రెవెన్యూకు 29, పంచాయ‌తీరాజ్‌కు 17, పోలీసు శాఖ‌కు 14 అర్జీలు వ‌చ్చాయి. అదేవిధంగా ఏపీఎస్‌డ‌బ్ల్యూఆర్ఈఐఎస్‌కు 9 అర్జీలు రాగా విద్య, ఆరోగ్యం, రిజిస్ట్రేష‌న్ అండ్ స్టాంప్స్‌కు ఆరు చొప్పున అర్జీలు వ‌చ్చాయి. విద్యుత్‌, డీఆర్‌డీఏ, గ్రామీణ నీటి స‌ర‌ఫ‌రా శాఖ‌ల‌కు నాలుగు చొప్పున , పౌర స‌ర‌ఫ‌రాలు 3, ఏపీఎస్ ఆర్‌టీసీ, విభిన్న ప్ర‌తిభావంతుల సంక్షేమం, ర‌హ‌దారులు-భ‌వ‌నాల శాఖ‌ల‌కు రెండు చొప్పున అర్జీలు అందాయి. బీసీ సంక్షేమం, స‌హ‌కార‌, డ్వామా, ఎండోమెంట్‌, గృహ నిర్మాణం, ఇరిగేష‌న్‌, ఎల్‌డీఎం, ఆర్ఐవో, నైపుణ్యాభివృద్ధి విభాగాల‌కు ఒక్కో అర్జీ వ‌చ్చాయి. ప్ర‌తి అర్జీపైనా ప్ర‌త్యేకంగా దృష్టిపెట్టి నిర్దేశ గ‌డువులోగా నాణ్య‌త‌తో ప‌రిష్క‌రించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ ఆదేశించారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌వో ఎం.ల‌క్ష్మీన‌ర‌సింహం, పీజీఆర్ఎస్ నోడ‌ల్ అధికారి జి.జ్యోతి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply