పాఠశాలల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి..
పాఠశాలల ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి..
నల్లబెల్లి, (ఆంధ్రప్రభ): రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు విచ్చలవిడిగా ఫీజులు పెంచుతూ తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్నందున తెలంగాణ ప్రభుత్వం తక్షణమే ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర కమిటీ సభ్యుడు మార్త నాగరాజు డిమాండ్ చేశారు.
సోమవారం నల్లబెల్లి మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ విద్యను వ్యాపారంగా మార్చి ప్రైవేట్ విద్యాసంస్థలు అధిక ఫీజులతో సామాన్య, మధ్యతరగతి కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా ప్రమాణాల కంటే లాభార్జనకే ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన విమర్శించారు.
అలాగే విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధంగా పాఠశాల ఆవరణలోనే పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, టైలు, బెల్టులు, యూనిఫాంలు విక్రయిస్తూ తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. బహిరంగ మార్కెట్ ధరల కంటే ఎక్కువ ధరలకు ఈ వస్తువులను విక్రయించడం అన్యాయమని అన్నారు.
ప్రభుత్వం బలమైన ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయడంతో పాటు, నిబంధనలు ఉల్లంఘిస్తున్న విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రతి పాఠశాలలో ఫీజుల వివరాలను పారదర్శకంగా ప్రదర్శించేలా చర్యలు చేపట్టి, విద్యాశాఖ అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని కోరారు.
