రెండేళ్ల పాలన విజయోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
అమరావతి పెరేడ్ గ్రౌండ్స్‌లో 12న కార్యక్రమం
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ సాయి కాంత్ వర్మ
ఉమ్మడి గుంటూరు బ్యూరో, ఆంధ్రప్రభ : రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “రెండు ఏళ్ల నమ్మకం – అభివృద్ధి – సంక్షేమం” కార్యక్రమాన్ని ఈ నెల 12న అమరావతి పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ సి.యం. సాయి కాంత్ వర్మ సోమవారం పరిశీలించారు. కార్యక్రమానికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

సభా ప్రాంగణంలో తాగునీటి సౌకర్యం, వైద్య శిబిరాలు, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని సూచించారు. పెద్ద సంఖ్యలో వాహనాలు రానున్నందున పార్కింగ్ ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు సమర్థవంతంగా ఉండేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు.

ముఖ్యమంత్రి కార్యక్రమానికి హాజరుకానున్న నేపథ్యంలో ఆయన ప్రయాణించే మార్గంతో పాటు ప్రజలు వచ్చే రహదారుల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. సభా ప్రాంగణంలో వివిధ ప్రభుత్వ శాఖలు గత రెండేళ్లలో సాధించిన విజయాలు, అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రతిబింబించే ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి ముందుగా ఈ ప్రదర్శనశాలలను సందర్శించి అనంతరం సభా వేదికకు చేరుకుంటారని కలెక్టర్ తెలిపారు.
ఈ తనిఖీలలో రెవెన్యూ, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య, రవాణా, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా, పౌర సరఫరాలు తదితర శాఖల అధికారులు పాల్గొని ఏర్పాట్లపై చర్చించారు. కార్యక్రమం విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.
