Andhra Prabha Special | ఏపీఎల్‌తో గ్రామీణ ప్రతిభకు పదును…

Andhra Prabha Special | ఏపీఎల్‌తో గ్రామీణ ప్రతిభకు పదును…

  • మూడు ప్రాంతాల్లో తొలిసారి డే&నైట్ మ్యాచ్‌లు
  • విశాఖలో తొలి మ్యాచ్ తో ఐపీఎల్ ప్రారంభం..
  • మంగళగిరిలో ఫైనల్ పోటీ
  • యువ క్రికెటర్లకు ఐపీఎల్ అవకాశాలకు వేదిక..
  • క్రీడతో పాటు వినోదం.. ప్రేక్షకులకు ఉచిత ప్రవేశం..
  • ఆంధ్రప్రభ ప్రత్యేక ఇంటర్వ్యూ లో ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్..

ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ విస్తరణకు, గ్రామీణ యువతలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఈసారి మరింత వైభవంగా జరగనుంది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను వేదికలుగా ఎంపిక చేస్తూ నిర్వహిస్తున్న ఈ టోర్నీ జూన్ 9 నుంచి 30 వరకు కొనసాగనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రభతో ప్రత్యేకంగా (Andhra Prabha Special) మాట్లాడిన ఏసీఏ అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఏపీఎల్ ప్రత్యేకతలు, లక్ష్యాలు, గ్రామీణ క్రీడాకారులకు కల్పిస్తున్న అవకాశాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.

ప్రశ్న: ఈసారి ఏపీఎల్ ప్రత్యేకత ఏమిటి?..

కేశినేని శివనాథ్: గత సీజన్లలో ఏపీఎల్‌ను ప్రధానంగా విశాఖపట్నంలో నిర్వహించాం. ఈసారి క్రికెట్‌ను రాష్ట్రవ్యాప్తంగా విస్తరించాలనే లక్ష్యంతో విశాఖపట్నం, మంగళగిరి, కడపలను వేదికలుగా ఎంపిక చేశాం. మంగళగిరి, కడపలో ప్రత్యేకంగా ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేసి డే-నైట్ మ్యాచ్‌లను నిర్వహిస్తున్నాం. జూన్ 9న విశాఖలో ప్రారంభమయ్యే టోర్నీ, జూన్ 30న మంగళగిరిలో జరిగే ఫైనల్‌తో ముగుస్తుంది.

ప్రశ్న: ఏపీఎల్ ద్వారా యువ క్రీడాకారులకు ఎలాంటి ప్రయోజనం కలుగుతోంది?

కేశినేని శివనాథ్: ఏపీఎల్ ప్రధాన లక్ష్యం గ్రామీణ, పేద కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన క్రికెటర్లకు వేదిక కల్పించడం. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల నుంచి ప్రతిభను గుర్తించి వారికి అవకాశాలు ఇస్తున్నాం. గత సీజన్లలో ఏపీఎల్ ద్వారా అనేక మంది యువ క్రీడాకారులు ఉన్నత స్థాయి పోటీల్లో గుర్తింపు పొందారు. భవిష్యత్తులో ఐపీఎల్ వంటి అత్యున్నత వేదికలకు చేరుకునే అవకాశాలు కూడా ఈ లీగ్ ద్వారా లభిస్తున్నాయి.

ప్రశ్న: గ్రామీణ ప్రతిభను ప్రోత్సహించేందుకు ఏసీఏ తీసుకుంటున్న చర్యలు ఏమిటి?

కేశినేని శివనాథ్: రూరల్ టాలెంట్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను ప్రత్యేకంగా అమలు చేస్తున్నాం. ప్రతిభ ఉన్న క్రీడాకారులను గుర్తించి శిక్షణ, మార్గదర్శకత్వం, పోటీ అనుభవం కల్పిస్తున్నాం. ఏడు జట్లలోనూ గ్రామీణ ప్రాంతాల నుంచి ఎంపికైన ఆటగాళ్లకు గణనీయమైన అవకాశాలు లభిస్తున్నాయి. ప్రతిభ ఉన్న ప్రతి యువకుడికి సరైన వేదిక అందించడమే మా లక్ష్యం.

ప్రశ్న: టోర్నీ నిర్వహణలో ఎలాంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు?

కేశినేని శివనాథ్: ఏపీఎల్ కోసం ప్రత్యేక గవర్నింగ్ బాడీ పనిచేస్తోంది. టోర్నీ నిర్వహణ, షెడ్యూల్, ఆటగాళ్ల సంక్షేమం, ప్రసారాలు, భద్రత తదితర అంశాలను ఆ బృందం పర్యవేక్షిస్తుంది. ఏసీఏ మొత్తం ప్రక్రియను మానిటర్ చేస్తోంది. ప్రేక్షకులందరికీ వినోదాన్ని పంచే విధంగా అన్ని అవసరమైన ఏర్పాట్లు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నాం.

ప్రశ్న: ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఎలాంటి కార్యక్రమాలు ఉంటాయి?

కేశినేని శివనాథ్: కేవలం క్రికెట్ మ్యాచ్‌లకే పరిమితం కాకుండా ప్రేక్షకులకు వినోదాన్ని అందించే ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. కుటుంబ సమేతంగా వచ్చి ఆస్వాదించేలా ఏర్పాట్లు చేశాం. ముఖ్యంగా ప్రవేశ రుసుము లేకుండా మ్యాచ్‌లను వీక్షించే అవకాశం కల్పిస్తున్నాం.

ప్రశ్న: యువతకు మీరు ఇచ్చే సందేశం ఏమిటి?

కేశినేని శివనాథ్: క్రీడలు వ్యక్తిత్వ వికాసానికి గొప్ప వేదిక. క్రీడాకారుల పట్టుదల, క్రమశిక్షణ, అంకితభావం యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయి. ప్రతి యువకుడు తన ప్రతిభను నమ్మి కష్టపడితే ఉన్నత శిఖరాలను అధిరోహించగలడు. ఏపీఎల్ వంటి వేదికలు ఆ కలలను నిజం చేసే అవకాశాలను అందిస్తాయి.

క్రికెట్‌కు సరికొత్త కొత్త దిశ..

రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్‌ను విస్తరించడంతో పాటు గ్రామీణ ప్రతిభకు ప్రోత్సాహం, ప్రేక్షకులకు ఉచిత వినోదం, యువతకు స్ఫూర్తినిచ్చే లక్ష్యాలతో ఏపీఎల్-2026 నిర్వహణకు ఏసీఏ సిద్ధమైంది. మూడు ప్రాంతాల్లో జరగనున్న ఈ మెగా క్రికెట్ సంబరం ఆంధ్రప్రదేశ్ క్రీడా చరిత్రలో మరో మైలురాయిగా నిలవనుందని క్రీడా వర్గాలు భావిస్తున్నాయి.