Cricket League I ఏపీఎల్-5కు సర్వం సిద్ధం
Cricket League I ఏపీఎల్-5కు సర్వం సిద్ధం
నవ్యాంధ్ర నలుమూలలా క్రికెట్ సందడి!
Cricket League I ఏపీఎల్-5కు సర్వం సిద్ధంవిజయవాడ, ఆంధ్రప్రభ:
ఆంధ్రప్రదేశ్ క్రికెట్ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయానికి తెరలేపుతూ, రాష్ట్రవ్యాప్తంగా క్రికెట్ సంబరాలకు వేదికగా నిలిచే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)-2026 కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 9వ తేదీ నుంచి 30వ తేదీ వరకు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న ఈ టోర్నీ ద్వారా క్రికెట్‌ను రాష్ట్ర నలుమూలలకు విస్తరింపజేయాలనే లక్ష్యంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ముందుకు సాగుతోంది.
విజయవాడలోని ఏసీఏ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ ఏపీఎల్ విశేషాలను వెల్లడించారు. రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి ఇది ఒక కొత్త దిశగా నిలవబోతోందని, యువతకు మరిన్ని అవకాశాలు కల్పించడమే ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
మూడు నగరాల్లో క్రికెట్ పండుగ..
ఈసారి ఏపీఎల్‌ను ఒకే ప్రాంతానికి పరిమితం చేయకుండా విశాఖపట్నం, కడప, మంగళగిరి నగరాల్లో నిర్వహించడం ద్వారా క్రికెట్ వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టామని చిన్ని తెలిపారు. మొత్తం ఏడు జట్లు పాల్గొనే ఈ టోర్నీలో జూన్ 9 నుంచి 14 వరకు విశాఖలో, జూన్ 17 నుంచి 21 వరకు కడపలో, జూన్ 24 నుంచి 30 వరకు మంగళగిరిలో మ్యాచ్‌లు జరుగుతాయని చెప్పారు. సెమీఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు మంగళగిరిలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. గత ఏడాది ఫైనల్ పోటీలకు వేలాదిమంది ప్రేక్షకులు హాజరై ఏపీఎల్‌కు విశేష ఆదరణ లభించిందని గుర్తుచేస్తూ, ఈసారి మరింత వైభవంగా నిర్వహించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
యువత కలలకు వేదికగా ఏపీఎల్..
రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల నుంచి వెలుగులోకి వస్తున్న యువ క్రికెటర్లకు ఏపీఎల్ ఒక గొప్ప అవకాశ వేదికగా నిలుస్తోందని చిన్ని పేర్కొన్నారు. ఈ టోర్నీలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆటగాళ్లకే ప్రాధాన్యం ఇస్తున్నామని, స్థానిక ప్రతిభను జాతీయ స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యమన్నారు.
ఇటీవల గుంటూరుకు చెందిన యువ క్రికెటర్ రషీద్‌కు ఇండియా-ఏ జట్టులో అవకాశం రావడం రాష్ట్ర క్రికెట్ అభివృద్ధికి నిదర్శనమని పేర్కొంటూ, భవిష్యత్తులో మరెందరో ఆటగాళ్లు ఏపీఎల్ ద్వారా దేశస్థాయికి ఎదుగుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.
విద్యార్థులకు ఉచిత ప్రవేశం..
యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు ఉచిత పాసులు అందించనున్నట్లు చిన్ని వెల్లడించారు. విద్యాసంస్థలకు ముందుగానే మ్యాచ్‌ల షెడ్యూల్ అందించి, విద్యార్థులు ప్రత్యక్షంగా మ్యాచ్‌లు వీక్షించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఆధునిక సదుపాయాలతో అంతర్జాతీయ స్థాయి వాతావరణం
విశాఖ, కడప, మంగళగిరి వేదికల్లో అత్యాధునిక సదుపాయాలతో మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫ్లడ్‌లైట్ల వెలుగులో జరిగే పోటీలు ప్రేక్షకులకు ప్రత్యేక అనుభూతిని అందిస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో మంగళగిరిని రాష్ట్ర క్రికెట్‌కు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా మౌలిక వసతుల అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.
క్రీడలతో పాటు ఆంధ్ర సంస్కృతి వైభవం
ఏపీఎల్‌ను కేవలం క్రికెట్ టోర్నీగా కాకుండా ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక వైభవాన్ని ప్రపంచానికి చాటే ఉత్సవంగా తీర్చిదిద్దుతున్నామని చిన్ని తెలిపారు. తోలుబొమ్మలాట, కోలాటం, జానపద కళారూపాలు, సాంస్కృతిక ప్రదర్శనలు, సినీ మరియు సంగీత రంగ ప్రముఖుల ప్రత్యేక కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించేలా ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు.
జియో స్టార్ స్పోర్ట్స్‌లో ప్రత్యక్ష ప్రసారాలు
రాష్ట్రవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు క్రికెట్ అభిమానులు ఏపీఎల్ మ్యాచ్‌లను వీక్షించేలా జియో స్టార్ స్పోర్ట్స్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. విశాఖలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రత్యేక ఫ్లాష్‌మాబ్ కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
నవ్యాంధ్ర …క్రీడా ప్రగతికి నాంది!..
పరిమిత వనరులతో ప్రారంభమైన ఏపీఎల్ నేడు రాష్ట్ర క్రీడా ప్రతిభను వెలికితీసే గొప్ప వేదికగా ఎదిగిందని చిన్ని పేర్కొన్నారు. నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అత్యుత్తమ ప్రమాణాలతో పోటీలను నిర్వహిస్తున్నామని చెప్పారు. మీడియా, క్రీడాభిమానులు, ప్రజలు కలిసి వర్ధమాన క్రీడాకారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. “ఏపీఎల్-2026 కేవలం ఒక క్రికెట్ టోర్నీ కాదు. యువత కలలకు వేదిక!రాష్ట్ర ప్రతిభకు గుర్తింపు! నవ్యాంధ్ర క్రీడా భవిష్యత్తుకు బలమైన పునాది అని ఎంపీ చిన్ని తెలిపారు.
