విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి
-ఊట్కూర్ లో ముగిసిన వేసవి శిక్షణ శిబిరం
ఊట్కూర్, ఆంధ్రప్రభ: విద్యార్థులు చదువుతోపాటు క్రీడారంగంలో రాణించాలనే సదుద్దేశంతో ప్రభుత్వం వేసవిలో వాలీబాల్ శిక్షణ శిబిరం ఏర్పాటు చేసిందని ఊట్కూర్ ఉప సర్పంచ్ రమేష్, జిల్లా క్రీడల అధికారి శెట్టి వెంకటేష్ అన్నారు. ఆదివారం నారాయణపేటజిల్లాఊట్కూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన వేసవి శిక్షణముగింపు శిబిరంలో విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం క్రీడాభివృద్ధికి ఎంతో కృషి చేస్తుందని ఏప్రిల్ 20 నుండి ఈనెల 7 వరకు వేసవి వాలీబాల్ శిబిరం నిర్వహించడంతో విద్యార్థులకు క్రీడల పట్ల ఆసక్తి కలిగిందన్నారు. ఓటమి గెలుపుకు తొలిమెట్టని క్రీడాస్పూర్తిని చాటితే గెలుపు వరిస్తుందని అన్నారు. క్రీడలు విద్యార్థుల మానసిక శారీరక దృఢత్వానికి ఎంతగానో దోహదపడతాయని అన్నారు.
విద్యార్థులు సమయాన్ని వృధా చేయకుండా క్రీడలు చదువుకు వినియోగించడం వల్ల జీవితంలో ఉన్నత లక్ష్యానికి చేరుతారని అన్నారు. రానున్న రోజుల్లో క్రీడాకారులకు అన్ని సౌకర్యాలతో కూడిన క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తామన్నారు. వేసవి శిక్షణ శిబిరంలో వాలీబాల్ క్రీడలో విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారని భవిష్యత్తులో క్రీడారంగంలో రాణించి గ్రామానికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలన్నారు. బహుమతుల దాత విశ్రాంత పిఈటి రమేష్ ను పలువురు సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల పిడి పారిజాత, బీజేవైఎం జిల్లా అధ్యక్షులుఎం.భరత్, వాలీబాల్ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జగదీష్ గౌడ్, సీనియర్ క్రీడాకారులు లక్ష్మణ్, కోచర్ సునీత తదితరులు పాల్గొన్నారు.
