Online Betting | రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
Online Betting | రైల్వే ఉద్యోగి ఆత్మహత్య
Online Betting | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : మహబూబాబాద్ జిల్లాలో ఆన్‌లైన్ బెట్టింగ్‌ల మోజు మరో కుటుంబంలో విషాదాన్ని నింపింది. డోర్నకల్ మండలం వెన్నారం గ్రామానికి చెందిన రైల్వే ఉద్యోగి బోయినపల్లి ఆంజనేయులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. గ్రామ శివారులోని ఓ చెట్టుకు ఉరివేసుకుని ఆయన బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
గ్రామస్థుల కథనం ప్రకారం… ఆంజనేయులు కొంతకాలంగా ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసయ్యారు. వరుస నష్టాల కారణంగా సుమారు రూ.30 లక్షల వరకు అప్పుల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. అప్పుల ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక చివరకు ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు.
ఆంజనేయులు మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
ఈ ఘటనతో ఆన్‌లైన్ బెట్టింగ్‌ల వల్ల యువత, ఉద్యోగులు ఆర్థికంగా నష్టపోయి తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. బెట్టింగ్‌లకు దూరంగా ఉండాలని, అనుమానాస్పద యాప్‌లు, వెబ్‌సైట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.
