కోర్టు సెంటర్ వద్ద అగ్నిప్రమాదం..

కోర్టు సెంటర్ వద్ద అగ్నిప్రమాదం..

దట్టమైన పొగలతో ప్రజలకు ఇబ్బందులు

మచిలీపట్నం (ఆంధ్రప్రభ): మచిలీపట్నంలోని జిల్లా కోర్టు సెంటర్ సమీపంలో ఆదివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కోర్టు సెంటర్ వద్ద ఉన్న ఖాళీ స్థలంలో పేరుకుపోయిన చెత్తాచెదారం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతాల్లో కలకలం రేగింది.

మంటల కారణంగా దట్టమైన పొగలు వ్యాపించి సమీప నివాస ప్రాంతాలను కమ్మేయడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పొగల వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడటంతో పాటు కొంతసేపు ఆ ప్రాంతంలో రాకపోకలు కూడా అంతరాయం కలిగాయి. ప్రస్తుతం నగరంలో తీవ్ర ఎండలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఘటన ప్రజలను మరింత ఆందోళనకు గురిచేసింది.

అగ్నిప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది వేగంగా స్పందించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.

అయితే చెత్తాచెదారానికి ఎలా మంటలు అంటుకున్నాయనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.

Leave a Reply