వీరాపురం పక్షి కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్

వీరాపురం పక్షి కేంద్రాన్ని సందర్శించిన జాయింట్ కలెక్టర్

వలస పక్షుల సంరక్షణలో గ్రామస్తుల పాత్ర అభినందనీయం: మౌర్య భరద్వాజ్

శ్రీ సత్యసాయి, జూన్ 7 (ఆంధ్రప్రభ): శ్రీ సత్యసాయి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. మౌర్య భరద్వాజ్ శనివారం జిల్లాలోని ప్రముఖ పక్షి సంరక్షణ కేంద్రం వీరాపురం గ్రామాన్ని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు.

ప్రతి సంవత్సరం శీతాకాలం, ఎండాకాలంలో సుదూర సైబీరియా ప్రాంతాల నుంచి వలస వచ్చే పెయింటెడ్ స్టార్క్ (రంగుల కొంగలు) పక్షుల నివాస ప్రాంతాలను పరిశీలించిన ఆయన, వాటి సంరక్షణ కోసం గ్రామస్తులు చేపడుతున్న చర్యలపై వివరాలు తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, దశాబ్దాలుగా వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వీరాపురానికి చేరుకునే ఈ అరుదైన పక్షులను స్థానిక ప్రజలు తమ సొంత బిడ్డల్లా సంరక్షించడం అభినందనీయమన్నారు. పక్షుల రాకతో వీరాపురం దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందిందని, ప్రకృతి సంపద పరిరక్షణలో గ్రామస్తుల పాత్ర ఆదర్శప్రాయమని కొనియాడారు.

వీరాపురం పక్షి కేంద్రాన్ని మరింత ఆకర్షణీయమైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. పక్షుల సంరక్షణకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చెరువుల్లో నీటి లభ్యతను నిరంతరం పర్యవేక్షించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అలాగే అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి పక్షుల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు.

పక్షుల గూళ్లు, ఆహార సేకరణ ప్రాంతాలు, విశ్రాంతి ప్రాంతాలను పరిశీలించిన జాయింట్ కలెక్టర్, ప్రకృతి పరిరక్షణతో పాటు పర్యావరణ సమతుల్యతకు ఈ వలస పక్షులు ఎంతో కీలకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో స్థానిక రెవెన్యూ అధికారులు, అటవీ శాఖ సిబ్బంది, గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply