బాధిత కుటుంబాలకు అండగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి
బాధిత కుటుంబాలకు అండగా ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి
భీమ్గల్లో విషాద ఘటనపై పరామర్శ..
రూ.18 వేల ఆర్థిక సాయం అందజేత
భీమ్గల్, జూన్ 7 (ఆంధ్రప్రభ):
భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలో జరిగిన ముగ్గురు చిన్నారుల మృతి ఘటన తీవ్ర విషాదకరమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ఆదివారం బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆయన వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్గల్ మున్సిపాలిటీ పరిధిలో లింబాద్రి గుట్ట వద్ద నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకునే రెండు కుటుంబాలకు చెందిన ముగ్గురు చిన్నారులు శుక్రవారం గుడిసెల వెనుక ఉన్న కుంటలో పడి మృతి చెందిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా చిన్నారులను కోల్పోయిన కుటుంబ సభ్యులను ప్రశాంత్ రెడ్డి ఓదార్చారు. పిల్లలను కోల్పోయిన తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతమని పేర్కొన్నారు.
ఈ ఘటనలో తన కుమారుడు, కుమార్తెను కోల్పోయిన ఓ తల్లి మనోవేదనతో అదే కుంటలో దూకేందుకు ప్రయత్నించి గాయపడిన విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే, ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. చికిత్సకు సంబంధించిన ఎలాంటి బిల్లులు వసూలు చేయవద్దని సూచించారు.
అనంతరం తహసీల్దార్ కిరణ్ కుమార్, ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్తో ఫోన్లో మాట్లాడిన ఆయన, బాధిత కుటుంబాలకు ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహాయం అందించాలని కోరారు. ముఖ్యంగా వారికి పక్కా ఇళ్లు మంజూరు చేసే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రమాదానికి కారణమైన నీటి కుంటను పరిశీలించిన ప్రశాంత్ రెడ్డి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కుంట చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయడం లేదా అవసరమైతే కుంటను పూడ్చివేయడం వంటి చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబాలకు తక్షణ ఖర్చుల నిమిత్తం రూ.18 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ చౌట్పల్లి రవి, కౌన్సిలర్లు నీలం రవి, బీ. నర్సయ్య, మల్లెల ప్రసాద్, మాజీ ఎంపీటీసీ ఎంఏ సూర్జిల్, డొల్ల రాజేశ్వర్, పర్స నవీన్, శ్రీపాద గోపి, దశరథ్, వేముల భాస్కర్, అవేజ్, తోగిటి అరుణ్, నీలం గంగాధర్, రాజు నాయక్, సాగర్, అశోక్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.
