కర్నూలులో గ్రేడ్–2 వీఆర్వో ఆత్మహత్య కలకలం…
కర్నూలులో గ్రేడ్–2 వీఆర్వో ఆత్మహత్య కలకలం…
సూసైడ్ లేఖతో సంచలనం.. కలెక్టరేట్ వద్ద మృతదేహంతో ఆందోళన..
కుటుంబ సభ్యులతో మాట్లాడిన కలెక్టర్
అనారోగ్యం ఉన్నా బీఎల్వో విధులు అప్పగించార’ అంటూ కుటుంబ సభ్యుల ఆరోపణ.
కర్నూల్ అర్బన్ తాసిల్దార్ పై ఆరోపణలు.
అధికారుల ఒత్తిడే కారణమా..? .
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : కర్నూలు రెవెన్యూ శాఖలో విషాదం చోటుచేసుకుంది. కర్నూలు అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో గ్రేడ్–2 వీఆర్వోగా విధులు నిర్వహిస్తున్న ఎస్.ఎం.డి. మహమ్మద్ హుస్సేన్ బాషా శనివారం తన ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపింది. తన ఆత్మహత్యకు అధికారుల వేధింపులు, విధుల ఒత్తిడే కారణమంటూ లేఖ రాసి ఉండటంతో ఈ ఘటన జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

మహమ్మద్ హుస్సేన్ బాషా మృతదేహాన్ని కుటుంబ సభ్యులు, సహచర వీఆర్వోలు, రెవెన్యూ ఉద్యోగులు కర్నూలు కలెక్టరేట్‌కు తీసుకువచ్చి ఆందోళన చేపట్టారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద నినాదాలు చేశారు. కొందరు ఆందోళనకారులు కలెక్టరేట్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సూసైడ్ లేఖలో అధికారుల పేర్లు?
ఆత్మహత్యకు ముందు మహమ్మద్ హుస్సేన్ బాషా రాసినట్లు చెబుతున్న లేఖలో తనపై విధుల భారం పెంచారని, ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోలేదని, కర్నూల్ అర్బన్ తాసిల్దార్ తో పాటు కొందరు అధికారుల కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని పేర్కొన్నట్లు సమాచారం. అయితే లేఖ ప్రామాణికతపై పోలీసులు, రెవెన్యూ అధికారులు దర్యాప్తు చేపట్టాల్సి ఉంది.
అనారోగ్యం ఉన్నా బీఎల్వో విధులు
మృతుడి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. హుస్సేన్ బాషాకు వెన్నెముకకు సంబంధించిన తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, గతంలో శస్త్రచికిత్స కూడా జరిగిందని తెలిపారు. ఎక్కువసేపు నడవలేనని, ఇంటింటికీ తిరిగి విధులు నిర్వర్తించడం కష్టమని పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ బీఎల్వో బాధ్యతలు అప్పగించారని ఆరోపించారు.
అనారోగ్య పరిస్థితిని తెలియజేస్తూ విధుల నుంచి మినహాయింపు కోరినా పట్టించుకోలేదని, అదే మానసిక ఒత్తిడికి దారితీసిందని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేకనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని కన్నీరుమున్నీరయ్యారు.
తహసీల్దార్‌పై కుటుంబ సభ్యుల ఆరోపణలు
తమ కుటుంబ పెద్ద మరణానికి కర్నూలు అర్బన్ తహసీల్దార్ రవికుమార్ బాధ్యత వహించాలని కుటుంబ సభ్యులు ఆరోపించారు. విధుల విషయంలో తీవ్ర ఒత్తిడి తెచ్చారని, తమ ఫిర్యాదులను పట్టించుకోలేదని కలెక్టర్‌కు వినిపించినట్లు తెలిసింది.
కాన్ఫరెన్స్ హాల్లో కుటుంబ సభ్యులతో కలెక్టర్ భేటీ
ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కుటుంబ సభ్యులను కలెక్టరేట్లోని సమావేశ మందిరానికి ఆహ్వానించి మాట్లాడారు. ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులపై కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వారి వేదనను విన్న కలెక్టర్ ఓదార్పు తెలిపారు.
ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని, వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం. అలాగే కుటుంబం తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందుల్లో ఉన్నందున ప్రభుత్వం తరఫున సాధ్యమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు.
కుటుంబంలో ఒకరికి ఉద్యోగం
మృతుడి కుటుంబ సభ్యులు ఆర్థిక భద్రతపై ఆందోళన వ్యక్తం చేయగా, కుటుంబంలో అర్హత ఉన్న ఒకరికి ఉద్యోగావకాశం కల్పించే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు ఆవేశానికి లోనుకాకుండా సహనం పాటించాలని కోరినట్లు సమాచారం.
రెవెన్యూ ఉద్యోగుల్లో ఆందోళన
ఈ ఘటనతో జిల్లాలోని వీఆర్వోలు, రెవెన్యూ ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఉద్యోగుల ఆరోగ్య పరిస్థితులు, పని భారం, ఎన్నికల విధులు, అదనపు బాధ్యతలపై ప్రభుత్వం సమీక్ష చేపట్టాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఒక ఉద్యోగి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఎందుకు ఏర్పడిందనే అంశంపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.
దర్యాప్తు కీలకం
ఆత్మహత్య వెనుక అసలు కారణాలు ఏమిటి? సూసైడ్ లేఖలో ఉన్న ఆరోపణలు ఎంతవరకు వాస్తవం? విధుల ఒత్తిడి ఎంత మేర ప్రభావం చూపింది? అనే అంశాలు ప్రస్తుతం దర్యాప్తులో తేలాల్సి ఉంది. పోలీసులు, జిల్లా యంత్రాంగం చేపట్టనున్న విచారణపై అందరి దృష్టి నెలకొంది. ప్రస్తుతం
ఆత్మహత్యకు గల కారణాలపై కుటుంబ సభ్యులు, ఉద్యోగ సంఘాలు చేసిన ఆరోపణలు మాత్రమే వెలువడ్డాయి. అధికారిక దర్యాప్తు పూర్తయ్యే వరకు వాస్తవాలు వెలువడే అవకాశం ఉంది.
