సాగుకు సిద్ధమవుతున్న రైతులు
సాగుకు సిద్ధమవుతున్న రైతులు
- పత్తి మొక్కజొన్న వరి పంటల సాగు అధికం
- జిల్లాలో 6,87 ,215 ఎకరాల సాగు అంచనా
- 59,579 క్వింటాళ్ల విత్తనాల అవసరం
- 1,21,881 మెట్రిక్ టన్నులు ఎరువులు అవసరం
నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : వానాకాల వ్యవసాయ సాగు కోసం నాగర్‌కర్నూల్ జిల్లా రైతులు తమ పొలాలను సిద్ధం చేస్తున్నారు. గత పంట అవశేషాలను తొలగించి, భూములను శుభ్రపరుస్తూ దుక్కులు దున్ని సాగుకు అనుకూలంగా మార్చుతున్నారు. సహజ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ పశువుల ఎరువు, కోళ్ల ఎరువు వంటి సేంద్రియ ఎరువులను వినియోగిస్తున్నారు. వర్షాలు కురిసిన వెంటనే విత్తనాలు వేయడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు.
రోహిణి కార్తె దాదాపు ముగింపు దశకు చేరుకోగా, మరో మూడు రోజుల్లో మృగశిర కార్తె ప్రారంభమవుతుందని రైతులు చెబుతున్నారు. ఈ కాలంలో సమృద్ధిగా వర్షాలు కురిస్తే పంటల సాగు మరింత వేగవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
పంటల సాగు అంచనాలు
నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలను అధికంగా సాగు చేస్తారు. ఈ వానాకాలంలో జిల్లాలో మొత్తం 6,87,215 ఎకరాల్లో పంటల సాగు జరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
పంటల వారీగా సాగు విస్తీర్ణం ఇలా ఉంది:
- పత్తి: 3,08,845 ఎకరాలు
- వరి: 1,92,796 ఎకరాలు
- మొక్కజొన్న: 96,992 ఎకరాలు
- జొన్నలు: 2,881 ఎకరాలు
- రాగులు: 3,752 ఎకరాలు
- ఇతర పంటలు: 30,672 ఎకరాలు
- ఉద్యానవన, పండ్ల తోటలు: 5,127 ఎకరాలు
గత రబీ సీజన్‌లో జిల్లాలో 6,46,992 ఎకరాల్లో పంటల సాగు జరిగింది.
విత్తనాల అవసరం
వానాకాల సాగుకు అవసరమైన విత్తనాల వివరాలు:
- వరి: 48,199 క్వింటాళ్లు
- మొక్కజొన్న: 7,779 క్వింటాళ్లు
- పత్తి: 2,780 క్వింటాళ్లు
- జొన్నలు: 115 క్వింటాళ్లు
- రాగులు: 113 క్వింటాళ్లు
- ఇతర పంటలు: 613 క్వింటాళ్లు
ఎరువుల అవసరం
జిల్లాలో ఈ సీజన్‌లో మొత్తం 1,21,881 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరమవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది.
వాటిలో:
- యూరియా: 66,508 మెట్రిక్ టన్నులు
- డీఏపీ: 14,089 మెట్రిక్ టన్నులు
- కాంప్లెక్స్ ఎరువులు: 37,203 మెట్రిక్ టన్నులు
- ఎంఓపీ: 1,816 మెట్రిక్ టన్నులు
- ఎస్ఎస్పీ: 2,265 మెట్రిక్ టన్నులు
ఈ వివరాలను జిల్లా వ్యవసాయ అధికారి యశ్వంత్‌రావు వెల్లడించారు.
వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని ఆశిస్తున్న రైతులు, ఇప్పటివరకు ఆశించిన మేర వానలు కురవలేదని చెబుతున్నారు. వర్షాలు ప్రారంభమైన వెంటనే విత్తనాలు వేసి సాగు పనులు చేపడతామని పేర్కొంటున్నారు.
