Transfers | తెలంగాణలో బదిలీల రగడ.. ఉద్యోగుల్లో అసంతృప్తి
Transfers | తెలంగాణలో బదిలీల రగడ.. ఉద్యోగుల్లో అసంతృప్తి
Transfers | బదిలీల్లో నిబంధనల ఉల్లంఘనలపై ఆరోపణలు
విద్యుత్ ఉద్యోగుల బదిలీల్లో అంతులేని అసంతృప్తి
జీవో 38 అమలు కోరుతూ ప్రభుత్వ వైద్యుల సమ్మె
Transfers | హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై అనేక శాఖల్లో పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వివిధ శాఖల్లో అడ్డగోలుగా నిబంధనల ఉల్లంఘన జరిగినట్లు ఉద్యోగ వర్గాల్లో చర్చ నడుస్తోంది. బదిలీలు కొందరు ఉద్యోగులకు శాపంగా మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకే పోస్టును ఎక్కువ మంది కోరిన సందర్భాల్లో ప్రాధాన్యత ప్రకారం పాటించాల్సిన ఏడు నిబంధనలను ఆర్థిక శాఖ వెల్లడించినప్పటికీ, వాటి అమలుపై పలు శాఖల్లో అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి.
మొదట్లో బదిలీ ఉత్తర్వులు, ఆ తర్వాత ఒకటి రెండు రోజుల్లోనే కాన్సిలేషన్లు వంటి పరిణామాలు తరచుగా చోటుచేసుకున్నాయి. విద్యుత్, విద్య, మున్సిపల్, వైద్యారోగ్య శాఖల్లో బదిలీలు అనేక సమస్యలకు కారణమయ్యాయి. కొన్ని శాఖల్లో బదిలీలకు అనుమతించకపోగా, బదిలీలు చేపట్టిన శాఖల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆందోళనలు నెలకొన్నాయి. ప్రభుత్వ వైద్యులు నేరుగా సమ్మెలోకి వెళ్లడం ఈ సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది.
ఆర్థిక శాఖ మార్గదర్శకాల్లో రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా ఉన్న అంశాలపై కూడా వివాదం నెలకొంది. భారీ ఎత్తున ఉల్లంఘనలు జరిగాయని ఉద్యోగ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. స్పౌజ్ కేటగిరీ కింద దంపతుల్లో ఒకరికి అవకాశం ఇవ్వడం కూడా వివాదాలకు కారణమైంది.
విద్యుత్ ఉద్యోగులది అంతులేని కథ
రాష్ట్రంలో విద్యుత్ ఉద్యోగుల బదిలీల ప్రక్రియ అంతులేని కథలా మారింది. ప్రభుత్వం అనుమతించినప్పటికీ సరైన సమయంలో ప్రక్రియ పూర్తి కాకపోవడం, మ్యుచువల్ ట్రాన్స్‌ఫర్లు తదితర కారణాలతో ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో వచ్చే ఆరు నెలల పాటు సాధారణ ఉద్యోగుల బదిలీలు నిలిచిపోయే అవకాశం ఉంది. ప్రత్యేక పరిపాలనా అవసరాలు లేదా ప్రభుత్వ అనుమతితో జరిగే బదిలీలకు మాత్రం మినహాయింపు ఉండే అవకాశం ఉంది. మే నెలలో బదిలీ పొందని ఉద్యోగులు తదుపరి సడలింపు కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.
ప్రభుత్వ వైద్యుల సమ్మె
ప్రభుత్వ ఆసుపత్రుల్లో తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘానికి చెందిన వైద్యులు సమ్మెకు దిగారు. వైద్యుల బదిలీ ప్రక్రియను వ్యతిరేకిస్తూ బంద్‌కు పిలుపునిచ్చిన వైద్యులు, ఓపీ సేవలను బహిష్కరించారు. ఓపీ, ఎలెక్టివ్ సేవలకు దూరంగా ఉంటామని ప్రకటించారు.
హైదరాబాద్ కోఠిలోని కార్యాలయంలో గురువారం రాత్రి ప్రభుత్వ వైద్యుల సంఘం అత్యవసర భేటీ అయింది. జీవో నంబర్ 38 ప్రకారం బదిలీలు జరగడం లేదని వైద్యులు ఆందోళన వ్యక్తం చేశారు. బదిలీల్లో పూర్తి పారదర్శకత పాటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. స్పౌజ్ కేటగిరీ, ప్రాధాన్యతా ప్రమాణాలు తప్పనిసరిగా అమలు చేయాలని, గుర్తింపు సంఘ నాయకులకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
జీవో 38 అమలు వరకు బదిలీ ఆప్షన్ ఫారాలను ప్రభుత్వ వైద్యుల సంఘం సమర్పించబోమని తెలిపారు. నిబంధనలు అమలు కాకపోతే సంఘం రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడుతుందని హెచ్చరించారు. అవసరమైతే వైద్య సేవల నిలిపివేతకు కూడా సిద్ధమని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యుల సంఘం వైద్యుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. శుక్రవారం ఉదయమే వైద్యులు సమ్మెలోకి వెళ్లారు.
బదిలీ ఉత్తర్వుల్లో అస్పష్టతతోనే..
గతంలో జారీ చేసిన జీవో-38 ప్రకారం 2026 మే 1 నుంచి మే 31 వరకు కొన్ని నిర్దిష్ట నిబంధనలతో ఉద్యోగుల బదిలీలపై ఉన్న నిషేధాన్ని ప్రభుత్వం సడలించింది. మే 31తో ఆ గడువు ముగిసిపోవడంతో జూన్ 1 నుంచి అన్ని రకాల బదిలీలను నిలిపివేస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది.
పరిపాలనా సౌలభ్యం కోసం ప్రత్యేక సందర్భాల్లో మాత్రం పోస్టింగ్ ఉత్తర్వులు ఇవ్వడానికి మినహాయింపు ఇచ్చారు. ఉద్యోగులకు ప్రమోషన్లు లభించినప్పుడు, ఇతర ఉద్యోగులను బదిలీ చేయకుండా ఖాళీగా ఉన్న స్థానాల్లో వారికి పోస్టింగ్స్ ఇవ్వవచ్చని తెలిపారు. పోస్టుల రద్దు, రివర్షన్లు, స్వదేశీ సర్వీసులకు తిరిగి వచ్చిన వారు, డిప్యుటేషన్లు, క్రమశిక్షణా చర్యల వల్ల వచ్చే వారికి ఇతర ఉద్యోగులను కదిలించకుండా ఖాళీ స్థానాల్లో పోస్టింగ్ ఇవ్వడానికి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.
ఆరు నెలల కంటే ఎక్కువ కాలం సుదీర్ఘ సెలవుపై వెళ్లి తిరిగి విధుల్లో చేరే ఉద్యోగులకు కూడా ఖాళీగా ఉన్న స్థానాల్లో పోస్టింగ్ ఇవ్వవచ్చని వెల్లడించారు.
వచ్చే 6 నెలలు బదిలీ ప్రతిపాదనలు వద్దు
వచ్చే ఆరు నెలల వరకు బదిలీల నిషేధాన్ని సడలించాలనే ఎలాంటి ప్రతిపాదనలను ఏ శాఖ కూడా స్వీకరించవద్దని జీవోలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎక్కడైనా నిషేధాన్ని సడలించాల్సి వస్తే, సచివాలయ పరిపాలనా శాఖ తగిన కారణాలతో కూడిన ఫైల్‌ను ఆర్థిక శాఖ కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సంబంధిత శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి ద్వారా ముఖ్యమంత్రికి పంపి, వారి సర్క్యులేషన్ ఉత్తర్వుల ద్వారా మాత్రమే అనుమతి పొందాల్సి ఉంటుందని వివరించింది.
ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి ఎవరైనా బదిలీలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని జీవోలో ప్రభుత్వం హెచ్చరించింది. ఈ ఉత్తర్వులకు విరుద్ధంగా బదిలీ అయిన ఉద్యోగుల వేతనాల బిల్లులను ఆమోదించవద్దని తెలంగాణ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ డైరెక్టర్, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్, డైరెక్టర్ ఆఫ్ వర్క్స్ అకౌంట్స్‌ను ప్రభుత్వం ఆదేశించింది.
