Sukku School | సుక్కు శిష్యుల జోరు మామూలుగా లేదుగా..

Sukku School | సుక్కు శిష్యుల జోరు మామూలుగా లేదుగా..

‘పెద్ది’ సినిమాతో దర్శకుడు బుచ్చిబాబు తన కెరీర్‌లో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. తొలి సినిమా ‘ఉప్పెన’తోనే బాక్సాఫీస్ దగ్గర సునామీ సృష్టించిన బుచ్చిబాబు.. ఇప్పుడు ‘పెద్ది’తో మరో బ్లాక్‌బస్టర్‌ను తన ఖాతాలో వేసుకుని స్టార్ డైరెక్టర్ల జాబితాలో చేరిపోయాడు.

రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ విడుదలైన తొలి రోజు నుంచే బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది. మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ సన్నివేశాలు, గ్రామీణ నేపథ్యం, బలమైన కథనంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.

‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు నుంచి వస్తున్న సినిమా కావడంతో ‘పెద్ది’పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆ అంచనాలను మించి సినిమా విజయాన్ని అందుకోవడం విశేషం. ముఖ్యంగా రామ్ చరణ్‌ను ఇప్పటివరకు చూడని విధంగా తెరపై చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

దర్శకుడిగా బుచ్చిబాబు బలం ఎప్పుడూ ఎమోష‌న్స్ కావ‌డం విశేషం. ప్రేక్షకులు పాత్రలతో కనెక్ట్ అయ్యేలా కథను నడిపించడంలో ఆయన ప్రత్యేక శైలి మరోసారి ‘పెద్ది’లో కనిపించింది. ఫస్ట్ హాఫ్‌లో మాస్ ఎలివేషన్స్, సెకండ్ హాఫ్‌లో ఎమోషనల్ పీక్స్‌తో సినిమాను నడిపించిన విధానం విమర్శకుల ప్రశంసలు అందుకుంటోంది.

ఇక సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు మరింత బలం చేకూర్చాయి. కీలక సన్నివేశాల్లో రెహమాన్ సంగీతం ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేసింది.

‘ఉప్పెన’తో తన ప్రతిభను నిరూపించుకున్న బుచ్చిబాబు.. ఇప్పుడు ‘పెద్ది’తో తన విజయం యాదృచ్ఛికం కాదని మరోసారి చాటిచెప్పాడు. రెండో సినిమాతోనే ఇండస్ట్రీలో భారీ బ్లాక్‌బస్టర్ అందుకోవడం ద్వారా టాలీవుడ్‌లో అత్యంత డిమాండ్ ఉన్న దర్శకుల జాబితాలో చేరిపోయాడు.

ప్రస్తుతం ‘పెద్ది’ విజయంతో సోషల్ మీడియాలో బుచ్చిబాబు పేరు ట్రెండ్ అవుతుండగా, ఆయన తదుపరి ప్రాజెక్ట్‌పై కూడా సినీ అభిమానుల్లో ఆసక్తి పెరిగింది. అయితే సోషల్ మీడియాలో… బుచ్చిబాబు పేరుతోపాటు మ‌రో పేరు కూడా ట్రెండింగ్ అవుతుంది. ఈ విజయంతో మరో పేరు కూడా గట్టిగా వినిపిస్తోంది. ఆ పేరు దర్శకుడు సుకుమార్.

బుచ్చిబాబు సుకుమార్ శిష్యుడు కావడంతో, సుకుమార్ తన శిష్యులకు ఎలాంటి ట్రైనింగ్ ఇస్తున్నాడురాబాబు.. అంటూ అభిమానులు సోషల్ మీడియాలో ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. వరుసగా సుకుమార్ స్కూల్ నుంచి వచ్చిన దర్శకులు విజయాలు సాధిస్తుండటంతో ఆయనపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

ఇక ఈ చర్చకు మరో కారణం కూడా ఉంది. ఇదే ఏడాది సుకుమార్ మరో శిష్యుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ‘ప్యారడైజ్’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. తొలి చిత్రం ‘దసరా’తో తన ప్రతిభను నిరూపించుకున్న శ్రీకాంత్ ఓదెల కూడా సుకుమార్ శిష్యుడే కావడం విశేషం.

ప్రస్తుతం ‘పెద్ది’ విజయంతో సుకుమార్ శిష్యులపై అంచనాలు మరింత పెరిగాయి. ‘పెద్ది’ ఇచ్చిన ఊపుతో ఇప్పుడు ‘ప్యారడైజ్’ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఆగస్టులో విడుదల కానున్న ‘ప్యారడైజ్’ కూడా ఇదే స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. బుచ్చిబాబు ‘పెద్ది’తో తన మార్క్ ఎమోషన్ అండ్ మాస్‌తో మ్యాజిక్ చేస్తే.. శ్రీకాంత్ ఓదెల ‘ప్యారడైజ్’తో ఎలాంటి ఊచకోత కోయబోతున్నాడనే క్యూరియాసిటీతో సినీ వర్గాల్లో నెలకొంది.

Leave a Reply