పర్యావరణ పరిరక్షణే భారతీయ సంస్కృతి

పర్యావరణ పరిరక్షణే భారతీయ సంస్కృతి

జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్

చిత్తూరు, ఆంధ్రప్రభ : సమాజంలోని ప్రతి వ్యక్తి ప్రకృతి, పర్యావరణ పరిరక్షణను సామాజిక బాధ్యతగా గుర్తించి ఆచరణలో పెట్టాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం గుడిపాల మండలంలోని జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మొక్కలు నాటి, విద్యార్థులు, ప్రజలకు సీడ్ బాల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడి వ్యక్తిగత కర్తవ్యమని పేర్కొన్నారు. మొక్కలను పెంచి పచ్చదనాన్ని విస్తరించే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ఉద్యమంలా చేపట్టాలని సూచించారు.

ప్రకృతి తల్లిలాంటిదని, చెట్లు సమస్త ప్రాణికోటికి జీవనాధారమని చెప్పారు. మన చుట్టూ ఉన్న పరిసరాలను పచ్చదనంతో నింపడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించగలమన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని, వాటిలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. ముఖ్యంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం భాగస్వామ్యంతో సామాజిక అడవుల పెంపకానికి ప్రాధాన్యత ఇస్తూ ఒకవైపు ఉపాధి అవకాశాలు కల్పిస్తూనే మరోవైపు పచ్చదనాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. ప్రతి కుటుంబం తమ ఇంటి పరిసరాల్లో కనీసం కొన్ని మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యతను స్వీకరించాలని సూచించారు.

యువత మొక్కల పెంపకాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలని, తాము నాటిన మొక్కలను క్రమం తప్పకుండా సంరక్షించాలని కలెక్టర్ సూచించారు. పర్యావరణ పరిరక్షణను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో తీసుకుంటోందని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో రాష్ట్రాన్ని హరితాభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్రమైన ఎండలు, వడగాలులు, అకాల వర్షాలు, తుఫానులు, సునామీలు, భూకంపాలు వంటి ప్రకృతి వైపరీత్యాలకు భూతాపం పెరగడం, వాతావరణ అసమతుల్యతలు ప్రధాన కారణాలని వివరించారు. ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి వనరులను విచక్షణారహితంగా వినియోగించడం, అడవుల నరికివేత, ప్లాస్టిక్ వినియోగం అధికమవడం వంటి చర్యలు పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణ పరిరక్షణే భారతీయ సంస్కృతిలో అంతర్భాగమని పేర్కొన్న కలెక్టర్, భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కల పెంపకంలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్, జిల్లా అటవీశాఖ అధికారి (డీఎఫ్‌ఓ) సుబ్బరాజు, ఫారెస్ట్ రేంజ్ అధికారులు ఎం. పట్టాభి, థామస్ సుకుమార్, ఎన్. బాలకృష్ణరెడ్డి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కరణ్ సింగ్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ హరిబాబు, అటవీశాఖ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply