22 people | బ్రేక్ ఫెయిల్‌తో వాహనం పల్టీ
22 people | బ్రేక్ ఫెయిల్‌తో వాహనం పల్టీ
22 people | పోలవరం, ఆంధ్రప్రభ: పోలవరం జిల్లా చింతూరు–మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో శుక్రవారం పెను ప్రమాదం తృటిలో తప్పింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో ఓ అశోక్ లేలాండ్ దోస్త్ వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న సేఫ్టీ ఫెన్సింగ్‌ను ఢీకొని పల్టీ కొట్టింది.

ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో 22 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి.

వాహనం ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా బ్రేకులు విఫలమవడంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం. దీంతో వాహనం రోడ్డు పక్కనున్న రక్షణ కంచెను ఢీకొని బోల్తా పడింది.

ప్రమాదంలో గాయపడినవారు కాకినాడ జిల్లా సామర్లకోట, జగ్గంపేట పరిసర ప్రాంతాలకు చెందిన వారిగా గుర్తించినట్లు సమాచారం.
సమాచారం అందుకున్న సీఆర్పీఎఫ్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఘటనాస్థలికి చేరుకున్న చింతూరు ఏఎస్పీ బొడ్డు హేమంత్ ప్రమాద పరిస్థితులను పరిశీలించి, ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు.
ప్రమాదంలో భారీ ప్రాణనష్టం తప్పడంతో ప్రయాణికులు, స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. బ్రేక్ ఫెయిల్ కారణంగా చోటుచేసుకున్న ఈ ఘటన ఘాట్ రోడ్లలో వాహనాల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తం చేస్తోంది.
