ప్రభుత్వాలు మారినా గ్రామం మారలేదు..
ప్రభుత్వాలు మారినా గ్రామం మారలేదు..
అభివృద్ధిపై కాపు యువసేన ఆగ్రహం
శావల్యాపురం, ఆంధ్రప్రభ: ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా గంటావారిపాలెం గ్రామ అభివృద్ధి మాత్రం శూన్యంగానే ఉందని రాష్ట్ర కాపు యువసేన అధ్యక్షుడు కర్ణా శ్రీనివాసరావు విమర్శించారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో గ్రామంలో నెలకొన్న సమస్యలను వివరించారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా గ్రామంలో చెప్పుకోదగ్గ అభివృద్ధి పనులు జరగలేదని, కేవలం 50 మీటర్ల సీసీ రోడ్డు నిర్మాణంతో సరిపెట్టారని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా కేవలం 100 మీటర్ల సిమెంట్ రోడ్డు మాత్రమే నిర్మించారని పేర్కొన్నారు.
గ్రామం నడిబొడ్డున మంచి నీటి చెరువు ఉన్నప్పటికీ రక్షిత మంచినీటి పథకం పూర్తిగా అటకెక్కిందన్నారు. గత ప్రభుత్వంలో సొసైటీ ఆధ్వర్యంలో ఉన్న రక్షిత మంచినీటి పథకాన్ని గ్రామ పంచాయతీలో విలీనం చేశారని, అనంతరం లక్షల రూపాయలు ఖర్చు చేసి ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు ఇచ్చినా తాగునీరు అందించలేకపోయారని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడిచినా రక్షిత మంచినీటి పథకాన్ని పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ పార్టీలకు గంటావారిపాలెం గుర్తుకు వస్తుందని, ఎన్నికలు ముగిసిన తర్వాత గ్రామాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.
గత ప్రభుత్వ హయాంలో కొత్తూరు వైపు పొలాలకు వెళ్లే మార్గంలో రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణ సమయంలో సుమారు 150 ఎకరాలకు సాగునీరు అందించే కాలువను పూడ్చివేశారని ఆరోపించారు. పనులు పూర్తయ్యాక కాలువను పునరుద్ధరిస్తామని చెప్పిన కాంట్రాక్టర్లు మాట తప్పడంతో రైతులు వర్షాధార సాగుపైనే ఆధారపడాల్సి వస్తోందన్నారు.
గుంటూరు–కర్నూలు ప్రధాన రహదారి గ్రామం మీదుగా వెళ్తున్నప్పటికీ ప్రధాన కూడలిలో సరైన వీధి దీపాలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గ్రామంలోని ప్రధాన రహదారులు కూడా దెబ్బతిన్నాయని, వర్షం పడితే కొత్తూరు రోడ్డుపై నీరు ప్రవహిస్తూ రాకపోకలకు ఆటంకం కలిగిస్తోందన్నారు.
గంటావారిపాలెంను ప్రత్యేక గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ఇప్పటికే ప్రభుత్వానికి పంపినట్లు పేర్కొంటూ, ప్రత్యేక పంచాయతీగా ఏర్పడితేనే గ్రామ అభివృద్ధికి అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు కొత్త పంచాయతీ పరిధిలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి రక్షిత మంచినీటి పథకాన్ని పునరుద్ధరించడంతో పాటు రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మాణం కోసం తొలగించిన సాగునీటి కాలువను తిరిగి ఏర్పాటు చేసి 150 ఎకరాలకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వాలు మారుతున్నా తమ గ్రామ పరిస్థితి మాత్రం మారలేదని కర్ణా శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు.
