ఇద్దరు కూతుళ్లతో వివాహిత అదృశ్యం.. మిస్సింగ్ కేసు నమోదు

ఇద్దరు కూతుళ్లతో వివాహిత అదృశ్యం.. మిస్సింగ్ కేసు నమోదు

భీమ్‌గల్‌ రూరల్, ఆంధ్రప్రభ:

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని భీమ్‌గల్‌ మండలం ముచ్కూర్ గ్రామానికి చెందిన ఓ వివాహిత తన ఇద్దరు కూతుళ్లతో కలిసి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది.

ఈ ఘటనకు సంబంధించి ఎస్సై సీహెచ్. తిరుపతి తెలిపిన వివరాల ప్రకారం, ముచ్కూర్ గ్రామానికి చెందిన కరగుల సుహాని అలియాస్ గాయత్రి (29) బుధవారం ఉదయం తన ఇద్దరు కూతుళ్లు సుభీక్షాదేవి (7), ఆద్య (4)తో కలిసి పుట్టింటికి వెళ్తున్నానని కుటుంబ సభ్యులకు చెప్పి వేల్పూర్ మండలం లక్కోరా గ్రామానికి బయలుదేరింది.

కొంత సమయం తర్వాత ఆమె సెల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యులకు ఆమెతో ఎలాంటి సంబంధం లేకుండా పోయింది. దీంతో భర్త కుటుంబ సభ్యులు, పుట్టింటి వారు ఆందోళనకు గురయ్యారు. ముచ్కూర్ నుంచి లక్కోరా వరకు, అలాగే బంధువుల ఇళ్లలో విస్తృతంగా వెతికినా వారి ఆచూకీ లభించలేదు.

సుహాని భర్త రవివర్మ ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశంలో ఉన్నట్లు సమాచారం. గురువారం గాయత్రి సోదరుడు దినేష్ భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఇంటి నుంచి బయలుదేరిన సమయంలో గాయత్రి ఎరుపు రంగు దుస్తులు ధరించి ఉండగా, పెద్ద కుమార్తె సుభీక్షాదేవి నీలం రంగు దుస్తులు, చిన్న కుమార్తె ఆద్య తెలుపు రంగు దుస్తులు ధరించి ఉన్నట్లు ఎస్సై తెలిపారు.

అదృశ్యమైన గాయత్రి, సుభీక్షాదేవి, ఆద్యల ఆచూకీ ఎవరికైనా తెలిసినట్లయితే భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని ఎస్సై తిరుపతి విజ్ఞప్తి చేశారు.

Leave a Reply