అల్లంపల్లి సమస్యల పరిష్కారం నా బాధ్యత: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు

అల్లంపల్లి సమస్యల పరిష్కారం నా బాధ్యత: ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు

ద్విచక్ర వాహనంపై మారుమూల గ్రామానికి ఎమ్మెల్యే పర్యటన

రోడ్డు సమస్యపై కలెక్టర్‌తో సమావేశానికి చర్యలు

కడెం, ఆంధ్రప్రభ: అల్లంపల్లి గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించే బాధ్యత తనదేనని ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ డీసీసీ అధ్యక్షుడు వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. కడెం మండలంలోని మారుమూల అటవీ గ్రామపంచాయతీ అయిన అల్లంపల్లిలో గురువారం ఆయన ద్విచక్ర వాహనంపై పర్యటించారు.

గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ స్థానిక ప్రజలతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, మంచినీటి బోర్ల డ్రిల్లింగ్ విషయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దని స్థానిక అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీ కార్మికులకు శానిటేషన్ కిట్లను పంపిణీ చేశారు.

బాబానాయక్ తండాలో ఐకేపీ వీవో భవనం, అంగన్వాడీ భవనం, గ్రామపంచాయతీ నూతన భవన నిర్మాణాలకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. గ్రామంలో తిరుగుతూ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి సంబంధించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. అటవీ శాఖ అభ్యంతరాల కారణంగా నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్లను కూడా ఆయన పరిశీలించారు.

చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న అల్లంపల్లి రోడ్డు సమస్య పరిష్కారానికి పూర్తి స్థాయి నివేదికతో ఈ నెల 5న నిర్మల్ జిల్లా కలెక్టర్‌తో సమావేశం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సూచించారు. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. గ్రామస్తులు, నాయకులు కలెక్టర్ కార్యాలయంలో జరిగే సమావేశానికి హాజరుకావాలని, తమ వద్ద ఉన్న పాత పట్టాలను వెంట తీసుకురావాలని గ్రామ పెద్దలకు సూచించారు. అల్లంపల్లి రోడ్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

దూర ప్రాంతాల నుంచి తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలకు వచ్చే ప్రజల పనులు సకాలంలో పూర్తయ్యేలా చూడాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. రానున్న వర్షాకాలంలో గాలి, వాన, పిడుగుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ ఖాజా మొయినుద్దీన్, ఎంపీడీవో అరుణ, విద్యుత్ శాఖ ఏడీఈ శ్రీనివాస్, ఐకేపీ ఏపీఎం గంగాధర్, ఈజీఎస్ ఏపీవో జయదేవ్, పంచాయతీరాజ్ ఏఈ చందన, గృహ నిర్మాణ శాఖ ఏఈ వంశీ, అల్లంపల్లి, బాబానాయక్ తండా, గంగాపూర్, రాణిగూడ, కుర్ర తండా గ్రామపంచాయతీల సర్పంచులు తుడసం కాంత, ఎం. సునీత, విజయలక్ష్మి, తోడ్సం సీతారాం, స్థానిక పంచాయతీ కార్యదర్శులు బి. మనోజ్, వంశీకృష్ణ, నిర్మల్ డీసీసీ ప్రధాన కార్యదర్శి పి. సతీష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కడెం మండల అధ్యక్షుడు బొడ్డు గంగన్న, కాంగ్రెస్ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కట్ట శ్యాంసుందర్, గంగాపూర్ మాజీ ఎంపీటీసీ ఎం. దాసు నాయక్, కాంగ్రెస్ నాయకులు జైల్ సింగ్, నరేష్, శంకర్, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave a Reply