యువత చేతుల్లోనే రేపటి భారత్!

యువత చేతుల్లోనే రేపటి భారత్!

విద్య‌, నైపుణ్యాలు పెంపొందించుకొని ఉన్న‌తంగా ఎద‌గాలి
ఆధునిక సాంకేతిక‌త‌ను స‌ద్వినియోగం చేసుకోవాలి
సోష‌ల్ మీడియాను దుర్వినియోగం చేయొద్దు
గిరిజ‌నుల సాధికారత ల‌క్ష్యంగా క‌మిష‌న్ అడుగులు
జాతీయ ఎస్‌టీ క‌మిష‌న్ ఛైర్మ‌న్ అంతర్ సింగ్ ఆర్యా

ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : యువతే దేశ భవిష్యత్తుకు పునాది అని.. నేటి యువత నైపుణ్యాలను పెంపొందించుకుని, ఉన్న‌తంగా ఎదిగి సమాజాభివృద్ధిలో భాగస్వాములు కావాలని జాతీయ ఎస్‌టీ కమిషన్ ఛైర్మ‌న్ అంతర్ సింగ్ ఆర్యా అన్నారు. జాతీయ ఎస్‌టీ క‌మిష‌న్ ఛైర్మ‌న్ అంత‌ర్ సింగ్ ఆర్యా.. క‌మిష‌న్ స‌భ్యులు నిరుప‌మ్ చ‌క్మా, జాటోతు హుస్సేన్‌, సెక్ర‌ట‌రీ ప్ర‌శాంత్ కుమార్ సింగ్‌, రాష్ట్ర గిరిజ‌న సంక్షేమ శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ఎంఎం నాయ‌క్‌, డైరెక్ట‌ర్ ఎస్‌.భార్గ‌వి, జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌తో క‌లిసి క‌లెక్ట‌రేట్‌లో జ‌రిగిన కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. తొలుత క‌లెక్ట‌రేట్ ప్రాంగ‌ణంలో ఏక్ పేడ్ మా కే నామ్ కార్య‌క్ర‌మంలో భాగంగా మొక్క‌లు నాటారు. ప‌ర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ తమ తల్లి పేరిట ఒక మొక్క నాటాలని పిలుపునిచ్చారు.

అనంత‌రం నేష‌న‌ల్ సికెల్ సెల్ అనీమియా ఎలిమినేష‌న్ మిష‌న్ కార్య‌క్ర‌మం అమ‌లుతీరుకు సంబంధించిన ప్ర‌దర్శ‌న‌ను ప‌రిశీలించారు. ప్ర‌ధానంగా జిల్లాలోని గిరిజ‌న ప్రాంతాల్లో మిష‌న్ అమ‌లు తీరుతెన్నుల‌ను వైద్యారోగ్య శాఖ అధికారుల‌ను అడిగి తెలుసుకున్నారు. గిరిజ‌న సాధికార‌త‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అమ‌లుచేస్తున్న ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల వివ‌రాల‌ను ప‌రిశీలించారు.17 శాఖ‌ల స‌మ‌న్వ‌యంతో అమ‌లవుతున్న 25 కార్యాచ‌ర‌ణ‌ల‌పై అధికారులు కమిష‌న్‌కు వివ‌రించారు. క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో గిరిజ‌న యువ‌త‌తో జ‌రిగిన యువ సంవాద్ కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా అంత‌ర్ సింగ్ ఆర్యా మాట్లాడుతూ గిరిజనుల హక్కుల పరిరక్షణ‌, స‌మ‌గ్ర అభివృద్ధి జాతీయ ఎస్‌టీ కమిషన్ ల‌క్ష్య‌మ‌ని.. ఈ ల‌క్ష్యాల సాధ‌న‌కు క‌మిష‌న్ క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు. గౌర‌వ ప్ర‌ధాన‌మంత్రి దిశానిర్దేశానికి ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా అమ‌లవుతున్న ఏక్ పేడ్ మా కే నామ్, నేష‌న‌ల్ సికెల్ సెల్ అనీమియా ఎలిమినేష‌న్ మిష‌న్, యువ సంవాద్ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌డం చాలా ఆనందంగా ఉంద‌న్నారు. యువ‌త సోషల్ మీడియా వినియోగంలో అప్రమత్తంగా ఉండాలని.. సైబర్ నేరాలు, దుష్ప్రచారాల పట్ల జాగ్రత్త వహించాలని సూచించారు.

మ‌న్ కీ బాత్‌, ప‌రీక్షాపే చ‌ర్చ వంటి కార్య‌క్ర‌మాల విశిష్ట‌త‌ను అర్థం చేసుకుంటూ ముంద‌డుగు వేయాల‌న్నారు. గౌర‌వ ప్ర‌ధాని ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా ఉండాల‌నే ఉద్దేశంతో ఇలాంటి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్న‌ట్లు వివ‌రించారు. యువ సంవాద్ అనేది కేవ‌లం గిరిజ‌న యువ‌త‌కే కాకుండా అధికారులు గ్రామీణ ప్రాంతాల్లో ప‌ర్య‌టించిన‌ప్పుడు ప్ర‌తిచోటా ఇలాంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించాల‌ని సూచించారు. భావి తరాల భవిష్యత్తును క్రమబద్ధంగా మార్చాలంటే ఇలాంటి కార్య‌క్ర‌మాలు ముఖ్య‌మ‌ని పేర్కొన్నారు.

గిరిజ‌నుల హ‌క్కుల ప‌రిర‌క్ష‌ణ ల‌క్ష్యంగా….

కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా జాతీయ ఎస్‌టీ క‌మిష‌న్ స‌భ్యులు నిరుప‌మ్ చ‌క్మా, జాటోతు హుస్సేన్‌, సెక్ర‌ట‌రీ ప్ర‌శాంత్ కుమార్ సింగ్‌.. కమిషన్ విధివిధానాల గురించి వివ‌రించారు. ఎస్‌టీల హ‌క్కులు, ప్రయోజనాలను పరిరక్షించడం. రాజ్యాంగం, చట్టాల ద్వారా ఎస్టీలకు కల్పించిన రక్షణలను పర్యవేక్షించడం, ఎస్టీల సామాజిక, ఆర్థిక, విద్యా అభివృద్ధికి సూచనలు చేయడం, ఎస్టీలపై జరిగే వివక్ష, అన్యాయాలు, హక్కుల ఉల్లంఘనలపై విచారణ చేపట్టడం, గిరిజన యువతకు విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అవకాశాలను పెంపొందించేందుకు సూచనలు చేయడం, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వ పరిరక్షణకు తోడ్పాటు అందించడం వంటి వాటిని వివ‌రించారు. కార్య‌క్ర‌మం సంద‌ర్భంగా క‌మిష‌న్ ఛైర్మ‌న్‌, స‌భ్యులు.. యువతతో ప్రత్యక్షంగా సంభాషించి విద్య, ఉపాధి, ఉన్నత విద్యలో ఎదురవుతున్న స‌వాళ్లు, సమస్యలపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. యువ‌త విజ్ఞ‌ప్తుల‌ను పరిశీలించి తగిన సిఫార్సులు ప్ర‌భుత్వానికి అందజేస్తామని తెలిపారు.
రాష్ట్రంలో గిరిజ‌న సంక్షేమ వ‌స‌తి గృహాల్లో సౌక‌ర్యాలు, సెంట‌ర్ ఆఫ్ ఎక్స‌లెన్స్ ద్వారా నీట్‌, జేఈఈ పోటీ ప‌రీక్ష‌లకు అందిస్తున్న‌శిక్ష‌ణ‌, స్ట‌డీ స‌ర్కిళ్ల ద్వారా సివిల్స్ కోచింగ్, ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న దిశ‌గా గిరిజ‌న యువ‌త‌ను ప్రోత్స‌హించ‌డం, వివిధ ప‌థ‌కాలు, ఉప‌కార‌వేత‌నాలు త‌దిత‌ర అంశాల‌ను రాష్ట్ర గిరిజ‌న సంక్షేమ శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ఎంఎం నాయ‌క్‌, డైరెక్ట‌ర్ ఎస్‌.భార్గ‌వి వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో ఎన్‌టీఆర్ జిల్లా గిరిజ‌న సంక్షేమ అధికారి ఎం.ఫణి ధూర్జ‌టి, గిరిజ‌న విద్యార్థులు, గిరిజన యువ‌త ప్ర‌తినిధులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply