దేవినేని వెంకట రమణ కు ఘన నివాళులు
దేవినేని వెంకట రమణ కు ఘన నివాళులు
నందిగామ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన ప్రజానేత..
రైతాంగ అభివృద్ధికి జీవితాన్ని అంకితం చేసిన నాయకుడిగా గుర్తింపు
టీడీపీ నాయకుల పూలమాలలతో భావోద్వేగ నివాళి
విజయవాడ, ఆంధ్రప్రభ : నందిగామ ప్రాంత ప్రజల ఆరాధ్య నాయకుడు, మాజీ మంత్రి స్వర్గీయ దేవినేని వెంకట రమణ 27వ వర్ధంతి సందర్భంగా విజయవాడలో ఘన నివాళుల కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకులు, రాష్ట్ర నాయకులు గన్నే ప్రసాద్ (అన్నా) కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమం భావోద్వేగ వాతావరణంలో కొనసాగింది. ఈ సందర్భంగా గన్నే ప్రసాద్ (అన్నా) పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి దేవినేని వెంకట రమణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కృష్ణా జిల్లా రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నేతగా దేవినేని వెంకట రమణ నిలిచిపోయారని అన్నారు.
నందిగామ మెట్ట ప్రాంత రైతాంగ అభ్యున్నతికి, ప్రజా సమస్యల పరిష్కారానికి తన రాజకీయ జీవితాన్ని అంకితం చేసిన మహానేతగా ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. రైతాంగ అభివృద్ధి, గ్రామీణ సమస్యల పరిష్కారం, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో రమణ పాత్ర అత్యంత కీలకమని నాయకులు పేర్కొన్నారు. నేటి తరానికి ఆదర్శప్రాయమైన నాయకుడిగా ఆయన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుందని తెలిపారు. ప్రజల కోసం నిరంతరం పనిచేసిన నాయకుడిగా ఆయన పేరు నందిగామ ప్రాంత ప్రజల హృదయాల్లో స్థిరంగా నిలిచిపోయిందని నివాళుల సభలో గుర్తుచేశారు.
ఈ కార్యక్రమంలో యలమంచిలి శ్రీనివాసరావు, కరణం జగన్మోహన్, పొన్నం రవి, చావా నరసింహారావు, తాడికొండ నరేంద్ర, మల్లెల వాసు, వెల్లంకి సుధాకర్, బి. ఆంజనేయులు, సరేపల్లి రాధాకృష్ణ, బండారుపల్లి అనిల్, బుర్ర కనకరావు, పైలా సతీష్, సురేష్, వీరమాచనేని సురేంద్ర తదితరులు పాల్గొని దేవినేని వెంకట రమణకు శ్రద్ధాంజలి ఘటించారు.
