గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక…

గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక…

  • రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదును తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలి..
  • ఉపాధి హామీ పథకంలో ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి పనులు…
  • జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు…

వెంకటాపూర్, ఆంధ్రప్రభ : గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని, రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదును తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని,ఉపాధి హామీ పథకంలో ప్రజల భాగస్వామ్యంతో గ్రామాల్లో అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు.

99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా వెంకటాపూర్ మండలం లోని కేశవాపూర్ గ్రామంలో నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు పాల్గొని గ్రామ ప్రజల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామపంచాయతీలను సందర్శించి గ్రామాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గ్రామసభలో ప్రజలు ప్రస్తావించిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

గ్రామాభివృద్ధి పనులను ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తామని, డీఆర్‌డీఏ, ఎంపీడీవోలు, ఎంపీఓల సమన్వయంతో జిల్లా స్థాయిలో జాబ్ క్యాలెండర్ రూపొందిస్తామని తెలిపారు. తాగునీటి ట్యాంకు నిర్మాణంతో పాటు ఇతర అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.

రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ నమోదును తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం రైతులకు అందించే పథకాల ప్రయోజనాలు సకాలంలో అందాలంటే నమోదు కీలకమని తెలిపారు. వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతు వేదికల ద్వారా రైతులకు పూర్తి సహకారం అందుబాటులో ఉంటుందని చెప్పారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ప్రజలు అధికంగా పాల్గొనాలని,ఉపాధి పనుల్లో కార్మికుల భాగస్వామ్యం పెరిగితే గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వీఓ భవనాలు తదితర మౌలిక సదుపాయాల అభివృద్ధికి మరింత నిధులు లభించే అవకాశం ఉంటుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో డీపీఓ వెంకయ్య, పంచాయతీరాజ్ శాఖ అధికారులు, డి ఈ రవీందర్ రెడ్డి ,గ్రామ సర్పంచ్ భద్రయ్య, ప్రజాప్రతినిధులు, అధికారులు, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Leave a Reply