కువైట్‌లో చిక్కుకున్న మహిళకు ఊరట
కువైట్‌లో చిక్కుకున్న మహిళకు ఊరట
- సురక్షితంగా స్వగ్రామానికి చేరిన భాగ్యవతి
- సోషల్ మీడియా విజ్ఞప్తిపై వెంటనే స్పందించిన ప్రభుత్వం
- కలెక్టర్, ఎస్పీ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాల ఏర్పాటు
- ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన బాధిత మహిళ
తిరుపతి ప్రతినిధి, ఆంధ్రప్రభ: ఉపాధి కోసం కువైట్ వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొన్న తిరుపతి జిల్లా మహిళ సురక్షితంగా స్వగ్రామానికి చేరుకుంది. వివరాలు.. చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీ పరిధిలోని గోపాలపురం గ్రామానికి చెందిన భాగ్యవతి ఉపాధి నిమిత్తం కువైట్‌కు వెళ్లారు. అయితే ఏజెంట్ చెప్పిన ఉద్యోగం కాకుండా ఇతర పనులు చేయించడంతో ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మానసిక వేదనకు గురైన ఆమె స్వదేశానికి తిరిగి రావాలని కోరుతూ సామాజిక మాధ్యమాల ద్వారా తన ఆవేదనను వ్యక్తం చేశారు.
ప్రత్యేక బృందాలు
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆమె వీడియోపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించింది. కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బరాయుడు పర్యవేక్షణలో అదనపు ఎస్పీ వెంకట్రావు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకుంటూ బాధితురాలి కుటుంబ సభ్యులను, ఆమెను కువైట్‌కు పంపిన ఏజెంట్‌ను గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టారు. ఫలితంగా భాగ్యవతి సురక్షితంగా భారతదేశానికి చేరుకొని స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భాగ్యవతి ఎస్పీ సుబ్బరాయుడిని మర్యాదపూర్వకంగా కలిసి తనను సురక్షితంగా స్వదేశానికి రప్పించడంలో సహకరించిన ప్రభుత్వ యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటానని భాగ్యవతి పేర్కొన్నారు.
జాగ్రత్తగా ఉండాలి
ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ.. విదేశాల్లో ఉపాధి అవకాశాల కోసం వెళ్లే వారు తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి పొందిన రిక్రూట్మెంట్ ఏజెన్సీలు, సంస్థల ద్వారానే వెళ్లాలని సూచించారు. ఉద్యోగం, జీతభత్యాలు, పని పరిస్థితులు, వీసా నిబంధనలు, యజమాని వివరాలు వంటి అంశాలను పూర్తిగా ధృవీకరించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. ఏజెంట్ల మాటలు మాత్రమే నమ్మి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడంతో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. విదేశాల్లో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే భారత రాయబార కార్యాలయం, స్థానిక అధికారులను లేదా కుటుంబ సభ్యులను సంప్రదించాలని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ మోసపూరిత ఏజెంట్ల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.
