sircilla weavers కలెక్టరేట్ జంక్షన్‌లో సజీవంగా నేత బతుకు
sircilla weavers కలెక్టరేట్ జంక్షన్‌లో సజీవంగా నేత బతుకు
Sircilla Weavers శిల్పాల్లో ఆవిష్కృతమైన సిరిసిల్ల చేనేత కథ
నేతన్నల చెమట, కష్టాలకు కళారూపం
ప్రారంభానికి సిద్ధమైన ప్రత్యేక ప్రతిమలు
సిరిసిల్ల ప్రత్యేకతను ప్రపంచానికి చాటే ప్రయత్నం
సిరిసిల్ల, ఆంధ్రప్రభ: ఓ మగ్గం… ఓ దారం… ఓ చెమట చుక్క. వీటన్నింటి కలయికే సిరిసిల్ల. తరాలుగా చేనేతను నమ్ముకుని బతుకుతున్న వేలాది నేత కుటుంబాల జీవన గాథను ఇప్పుడు సిరిసిల్ల కలెక్టరేట్ జంక్షన్ సజీవంగా ఆవిష్కరించబోతోంది.

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ జంక్షన్‌లో ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక కళా ప్రతిమలు ఇప్పుడు ప్రారంభానికి సిద్ధమయ్యాయి. ఇవి కేవలం శిల్పాలు కావు… సిరిసిల్ల నేతన్నల బతుకుబండిని లాగిన చేతుల కథలు. మగ్గం చప్పుడు మధ్య పెరిగిన తరాల జ్ఞాపకాలు. దారంలో కలిసిపోయిన ఆశలు, కష్టాలు, ఆనందాలు, ఆవేదనల ప్రతిరూపాలు.
చేనేత కళకు చిరునామాగా నిలిచిన సిరిసిల్ల ప్రత్యేకతను ప్రతిబింబించేలా ఈ కళారూపాలను తీర్చిదిద్దారు. నేత కార్మికుల దైనందిన జీవితంలో కనిపించే అనేక దృశ్యాలను శిల్ప రూపంలో మలిచి ఏర్పాటు చేశారు. మగ్గం ముందు కూర్చున్న నేతన్న, దారాన్ని సిద్ధం చేస్తున్న మహిళ, చేనేత వృత్తిలోని వివిధ ఘట్టాలు ఈ కళా ప్రతిమల్లో జీవం పోసుకున్నట్లుగా కనిపిస్తున్నాయి.
ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా మగ్గాన్ని వదలని సిరిసిల్ల నేతన్నల ఆత్మవిశ్వాసానికి ఇవి ప్రతీకలుగా నిలవనున్నాయి. ఒకప్పుడు ప్రపంచానికి వస్త్రాలు నేసిన చేతుల వెనుక ఎంతటి శ్రమ, ఎంతటి త్యాగం దాగి ఉందో ఈ కళారూపాలు చెప్పకనే చెబుతున్నాయి.
ప్రస్తుతం తుదిమెరుగులు దిద్దుకుంటున్న ఈ ప్రతిమలు త్వరలోనే ప్రజల సందర్శనకు అందుబాటులోకి రానున్నాయి. తమ జీవితాన్నే కళారూపాలుగా మలిచి గౌరవించడం పట్ల సిరిసిల్ల నేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
“సిరిసిల్లకు వస్తే కేవలం ఓ జంక్షన్ కనిపించదు… మగ్గం మాట్లాడే ఓ కథ వినిపిస్తుంది. నేతన్న చెమటతో నేసిన ఓ జీవనగాథ కళ్లముందు నిలుస్తుంది.” ఇదే ఇప్పుడు కలెక్టరేట్ జంక్షన్ చెప్పబోతున్న సందేశం.
also read ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు..పాల్గొన్న మంత్రి అడ్లూరి
