FireAccident | ఢిల్లీ రెస్టారెంట్‌లో ఫైర్..
FireAccident | ఢిల్లీ రెస్టారెంట్‌లో ఫైర్..
FireAccident | 21 మంది సజీవ దహనం
40 మంది వరకు గాయాలు
37 మందిని రక్షించిన ఫైర్ సిబ్బంది
మరణించిన వారిలో అత్యధికులు విదేశీయులే
ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
మృతుల కుటుంబాలను సానుభూతి, నష్టపరిహారం ప్రకటన
FireAccident | క్రైమ్ బ్యూరో, ఆంధ్రప్రభ : దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మాలవీయ నగర్‌లోని ఓ రెస్టారెంట్లో బుధవారం ఈ ప్రమాదం సంభవించింది. ఇప్పటికే 21 మంది వరకు మరణించగా.. 40 మంది వరకు గాయపడ్డారు. వారిని వైద్య చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. రెస్టారెంట్ భవనంలో మరో 30 వరకు చిక్కుకొని ఉన్నట్లు సమాచారం. కాగా మరణించినవారిలో అత్యధికులు ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన వారని అధికారులు తెలిపారు.
ఉదయం సుమారు 9 గంటలకు రెస్టారెంట్ బేస్‌మెంట్‌లో మంటలు చెలరేగాయనీ, త్వరగా ఎగువ అంతస్తులకు వ్యాపించాయని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారులు తెలిపారు. దీనిపై ఢిల్లీ పోలీసులు, ఫైర్ సర్వీసెస్ 10 ఫైర్ టెండర్లు, రెస్క్యూ బృందాలు స్పందించి 37 మందిని రక్షించారు. గాయపడిన వారిని ఎయిమ్స్, సాకెట్ ఆసుపత్రులకు తరలించారు. ఇది ఇలా ఉంటే బుధవారం ఉదయం లెమన్ రెస్టారెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు సమాచారం అందించిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నాలు ప్రారంభించారు.
పది ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పుతున్నాయి. రెస్టారెంట్‌లో మరికొందరు చిక్కుకుని ఉంటారని అధికారులు భావిస్తున్నారు. రెస్క్యూ బృందాలు ఇంకా సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణమా లేదా ఇతర కారణాలా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ప్రమాదసమయంలో చాలా మంది నిద్రలో ఉన్నారు.. ఒక్కసారిగా పొగ గదులలోకి ప్రవేశించడంతో ఊపిరి ఆడక ఎక్కువ మంది మరణించారు. అలాగే ఈ హోటల్ కు ఒకే ఒక ఎగ్జిట్ డోర్ ఉండటంతో అందులోని బస చేసిన వారు వేగంగా బయటకు రాలేక మంటల్లో చిక్కుకుపోయారు..
ప్రమాదంపై స్పందించిన ప్రధాని.. ఎక్స్ గ్రేషియా ప్రకటన
మాలవీయా నగర్ అగ్నిప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. అగ్నిప్రమాదంలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు, బాధితులకు అధికారులు అన్ని విధాలా సహాయం అందిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల చొప్పున ఎక్స్-గ్రేషియా ప్రకటించారు.
