ద్విచక్ర వాహనం కిందపడి వృద్ధుడికి గాయాలు
ద్విచక్ర వాహనం కిందపడి వృద్ధుడికి గాయాలు
మోత్కూర్, ఆంధ్రప్రభ: మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో జామ చెట్ల బావి నుంచి కొండాపురం వరకు వెళ్లే రోడ్డులో కంకర కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీటీ రోడ్డు నిర్మాణంలో భాగంగా కాంట్రాక్టర్ కేవలం కంకర పోసి గత మూడు నెలలుగా పనులు నిలిపివేయడంతో ద్విచక్ర వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కొండాపురానికి చెందిన మన్నే శ్రీను అలియాస్ జనార్దన్ అనే వృద్ధుడు మంగళవారం తన ఎక్సెల్ వాహనంపై ఈ రోడ్డులో వెళ్తుండగా కంకర తగిలి వాహనం అదుపుతప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఆయన కన్ను, మోకాళ్లు, చేతులకు గాయాలయ్యాయి.
గమనించిన స్థానికులు వెంటనే ఆయనను ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. నిత్యం కొండాపురం–జామ చెట్ల బావి రూట్లో కంకర రోడ్డుపై ప్రయాణం ఇబ్బందికరంగా మారిందని ప్రజలు వాపోతున్నారు.
అధికారులు వెంటనే స్పందించి బీటీ రోడ్డు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
